మోడీతో బాబు… భేటీ తర్వాత ఖుషీ…ఖుషీగా…!

భారత ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మోడీకి 17 పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. దీంతో పాటు తిరుపతి లడ్డూను కూడా మోడీకి ఇచ్చారు చంద్రబాబు. అయితే వీరిరువురి బేటీ దాదాపు అరగంటకు పైగానే సాగింది. తాను చేసిన ప్రతిపాదనలపై మోడీ పూర్తి సానుకూలంగా స్పందించారని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 58 వేల కోట్లతో రూపొందించిన తాజా అంచనాలను ఆమోదించాలని చంద్రబాబు కోరారు. రాజధాని అమరావతి నిర్మాణం కోనం రానున్న బడ్జెట్ లో నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరారు. అలాగే ఏపీలో 175 శాసనసభ నియోజకవర్గాలను 225 నియోజకవర్గాలకు పెంచాలని కూడా చంద్రబాబు కోరారు.

పోలవరం ప్రధానాంశంగా….

రాష్ట్ర విభజన చట్టంలో రూపొందించిన మొత్తం హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలనిచంద్రబాబు మోడీకి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని, దానిని పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ఆ మొత్తాన్ని వెంటనే తిరిగి తమకు ఇప్పించాలని కోరారు. ఆ ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరించాలన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిని నిర్ణయించి దాని విధివిధానాలు ఖరారు చేసేలా నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా చంద్రబాబు కోరారు. దుగ్గిరాజపట్నం పోర్టును కూడా పూర్తి చేయాలని తాము కోరామన్నారు. విభజన హామీల అమలుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. 9వ షెడ్యూల్ లోని సంస్థలను ఏపీలో ఏర్పాటుచేయాలని కోరారు.

ప్యాకేజీ నిధులపైన…..

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా తాము సంతోషంగా అంగీకరించామని, అయితే వీటికింద 20,010 కోట్లు రావాల్సి ఉండగా, అయిదేళ్లలో ప్రాజెక్టులపై ఖర్చుపెట్టే సామర్థ్యం లేదని వివరించారు. తమకు విదేశీరుణాలు, నాబార్డు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కోరారు. అలాగే విశాఖ రైల్వేజోన్, అమరావతి మెట్రో రైలు వంటి పథకాల గురించి కూడా చంద్రబాబు మోడీతో చర్చించారు. అయితే ఈ భేటీలో రాజకీయ పరమైన అంశాలేవీ చర్చించలేదని చంద్రబాబు తర్వాత మీడియా సమావేశంలో చెప్పారు. కేవలం విభజనచట్టంలో ఉన్న హామీలు, ప్రధాన ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాత్రమే మోడీ తో చర్చించానన్నారు. అయితే తాము చెప్పిన అంశాలన్నింటినీ మోడీ సావధానంగా విన్నారని, త్వరలోనే తాను అందరితో మాట్లాడి ఏపీకి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానన్నారని చంద్రబాబు చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1