మోడీ దిగొస్తారా? లైట్ తీసుకుంటారా?

టీడీపీ వ్యూహాన్ని మార్చుకుంది. నిన్న హోంమంత్రిరాజ్ నాధ్ సింగ్ ను కలిసి ఏపీ విభజన హామీలు అమలు చేయాలని కోరారు. అయినా అనుకున్న మేరకు స్పందన రాకపోవడంతో ఈరోజు పార్లమెంటు లోపల, బయట నిరసనను తెలియజేయనున్నారు. పార్లమెంటు బయట గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగనున్నారు. ఈరోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఏపీ విభజన హామీలపై ప్రకటన చేయాలంటూ టీడీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈరోజు పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఎవరి హామీలతో సంబంధం లేకుండా నిరసనల సెగ తగిలేలా కార్యక్రమాలను రూపొందించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాజ్ నాధ్ సింగ్ ను నిన్న కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతి రాజు కలిశారు. అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటామని, ఏపీకి ఏమేం కావాలో జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఎన్నాళ్లు నివేదికతో కాలయాపన చేస్తారని టీడీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు అమరావతి నుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందని, ఎక్కడ అన్యాయం జరిగిందో…అక్కడే న్యాయం జరగేలా పోరాడాలని ఎంపీలకు బాబు సూచించారు. మూడున్నరేళ్లలో ఏపీకి చేసింది కొంతేనని, చేయాల్సింది ఎంతో ఉందని చంద్రబాబు అన్నారు.

వైసీపీ, కాంగ్రెస్ ల నోటీసులు….

ఇక వైసీపీ నేతలు కూడా దూకుడు పెంచారు. వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి 184 నిబంధన కింద నోటీసులు ఇచ్చారు. దీనిప్రకారం చర్చతో పాటు ఓటింగ్ జరగనుంది. ఈ నోటీసు ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి చేరిందని సమాచారం. ఓటింగ్ కు వస్తే ఇప్పటికే దాదాపు పదిమంది బీజేపీ ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలన్నది వైసీపీ వ్యూహంగా కన్పిస్తుంది. అలాగే ఇక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు కూడా ఏపీకి జరిగిన అన్యాయంపై పెద్దల సభలో నిలదీస్తున్నారు. కాలింగ్ అటెన్షన్ నోటీసులు వైసీపీ, కాంగ్రెస్ ఇచ్చింది. ప్రయివేటు మెంబర్ బిల్లును కూడా ఇచ్చారు. రొటేషన్ పై రాజ్య సభలో ఎప్పుడైనా చర్చకు వచ్చే అవకాశముంది. మోడీ సర్కార్ పై వత్తిడి తెచ్చేలా ఏపికి చెందిన మూడు పార్టీలకు చెందిన ఎంపీలు ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రశ్నోత్తరాలను రద్దు చేసి…..

ప్రధాని మోడీని సయితం కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు టీడీపీ ఎంపీలు ప్రధానిని కలవనున్నారు. ప్రధాని వద్ద తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించనున్నారు.  బీజపీ సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. బీజేపీ కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, రాష్ట్రంపైన కక్షతోనే ఈ విధంగా వ్యవహరిస్తుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ తాము ఇచ్చామంటున్న నిధులు ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇవ్వలేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంస్థలను మాత్రమే ఇచ్చారని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ఈరోజు నుంచి సభను నడవనివ్వకుండా చేస్తామంటున్నారు. మొత్తం మీద మోడీ సర్కార్ పై వత్తిడి తెచ్చేందుకు ఏపీకి చెందిన మూడు పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. మరి మోడీ దిగి వస్తారా? లేక లైట్ తీసుకుంటారో చూడాలి.