మోడీది మోస్ట్ కాస్ట్ లీ పార్టీ

నీతులు వల్లించడానికే తప్ప…. ఆచరించడానికి కావన్న పాత నానుడి ప్రధాన రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ప్రజా జీవితంలో పారదర్శకత, రుజువర్తన పాటించాల్సిన అవసరాన్ని గురించి అదేపనిగా మాట్లాడే పార్టీలు తమ దగ్గరకు వచ్చేసరికి వీటిని తుంగలో తొక్కుతున్నాయి. అన్ని పార్టీలూ కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే చందాల ఆధారంగానే పనిచేస్తాయి. నిబంధనల ప్రకారం నైతిక విలువల మేరకు అవి పొందే విరాళాలను ఏటా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఇందుకు సంబంధించిన పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) వివరాలను కూడా అందజేయాలి. ఈ విషయంలో వారూవీరు అనే తేడా లేకుండా జాతీయ పార్టీలు నిబంధనలను నిర్లజ్జగా ఉల్లంఘిస్తున్నాయి. ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీకి అడ్డంకే లేకుండా పోయింది. విలువల గురించి మాట్లాడే ఆ పార్టీ ఈవిషయంలో మౌనం దాలుస్తోంది. ఇది ఎవరో చేసిన విమర్శ కాదు. ఆరోపణ అంతకంటే కాదు. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) వెల్లడించిన చేదు నిజమిది.

పార్టీలకు నిబంధనలు వర్తించవా?

1546 మంది దాతల నుంచి దాతల నుంచి జాతీయ పార్టీలకు 355.08 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. ఇందులో అధికార భారతీయ జనతా పార్టీకి 159.59 కోట్లు అందాయి. వీటికి సంబంధించిన దాతల పేర్లు గాని, పాన్ తదితర వివరాలు లేవు. సాధారణ ప్రజల విషయంలో నిబంధనలు అంటూ సతాయించే అధికారులు కోట్ల రూపాయల విరాళాల విషయంలో కిమ్మనకుండటం ద్వంద ప్రమాణాలకు నిదర్శనం. రోజూ అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టే పార్టీలు ఈ విషయం తెలియనట్లే వ్యవహరించడం గమనార్హం. ఫోర్త్ ఎస్టేట్ గా తనకు తాను భుజకీర్తులను తగిలించుకున్న మీడియా కూడా మౌనాన్నే ఆశ్రయించడం మరింత ఆందోళనకర పరిణామం. చట్టం ఉన్నవాడికి చుట్టం అన్న సామెతను ఈ విషయం గుర్తుకు తెస్తోంది.

బీజేపీకి వచ్చిన విరాళాలు 705 కోట్లు….

ఈ విషయాన్ని పక్కన బెడితే పార్టీలకు అందిన విరాళాలు ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీకి అందిన విరాళాల మొత్తం చూస్తే కళ్లు తిరగక మానదు. దేశంలోని అన్ని జాతీయ పార్టీలకు గత నాలుగేళ్లలో అందిన విరాళాల మొత్తం అక్షరాలా 1076.68 కోట్లు. ఇందులో బీజేపీ వాటా 705.81 కట్లు. అంటే సింహభాగం దీనికే దక్కింది. ఇది మొత్తం విరాళాల్లో 73 శాతం. 2987 కార్పొరేట్ సంస్థల నుంచి బీజేపీకి ఈ మొత్తం లభించింది. ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పార్టీకి 167 కార్పొరేట్ సంస్థల నుంచి అందిన మొత్తం 198.16 కోట్లు. కార్పొరేట్ శక్తులకు ప్రీతిపాత్రుడుగా పరిగణించే శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి 50.73 కోట్లు లభించాయి. సీపీఎంకు కేవలం 1.89 కోట్లు మాత్రమే దక్కాయి. మరో వామపక్షమైన సీపీఐకి కేవలం 18 లక్షలు మాత్రమే విరాళాలు అందాయి. విరాళాల మొత్తాన్ని గమనిస్తే ఆయా పార్టీల స్థాయిని బట్టి అందాయని అర్థమవుతోంది. 2012-13 నుంచి 2015-16 వరకూ నాలుగేళ్లలో ఈ మొత్తం ఆయా పార్టీలకు అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఏ ఒక్కరి నుంచి కూడా 20 వేల రూపాయలకు మించి విరాళాలు స్వచ్ఛందంగా అందనందున మాయావతి సారధ్యంలోని బీఎస్పీని ఈ జాబితాలో చేర్చలేదు. మొత్తం 1070. 68 కోట్ల విరాళాల్లో 956.77 కోట్లు కార్పొరేట్ కంపెనీల నుంచే వచ్చింది కావడం గమనార్హం. వంద కోట్ల పైమొత్తాన్నే ఇతరులు సమకూర్చారన్నమాట. ఆ ఇతరులు ఎవరో ఏపార్టీ కూడా వెల్లడించలేదు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీలకు పెద్దమొత్తంలో విరాళాలు అందాయి.

అధికార, ప్రతిపక్షాలకు ఎంత వ్యత్యాసం?

అధికార పార్టీకి మరీ అత్యధికంగా విరాళాలు లభించడం, విరాళాల విషయంలో స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం క్రియాశీలకంగా వ్యవహరించక పోవడం విమర్శలకు తావిస్తోంది. విరాళాల్లో సింహభాగం బీజేపీ ఖాతాలోనే జమ అయింది. బీజేపీ, కాంగ్రెస్ లకు లభించిన విరాళాల్లో వ్యత్యాసం అధికంగా ఉంది. 2004 నుంచి 2014 వరకూ పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వమే అధికారంలో ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు అందే విరాళాల్లో పెద్దగా తేడా ఉండేది కాదు. వంద, రెండొందల కోట్లకు మించి వ్యత్యాసం ఉండేది కాదు. ఇప్పుడు ఆ తేడా చాలా పెద్దమొత్తంలో ఉండటం గమనార్హం. బీజేపీ భారత రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగడం, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నానాటికీ కుదేలవుతుండటంతో దానికి వచ్చే విరాళాల మొత్తంలో తగ్గుదల కన్పిస్తోంది. సంప్రదాయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇంకా కార్పొరేట్ కళను పూర్తి స్థాయిలో సంతరించుకోలేదన్న వాదన ఉంది. గతాన్ని పక్కన బెడితే నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి కార్పొరేట్ సంస్థగా, వృత్తిపరమైన నిపుణుల సంస్థగా పనిచేస్తోందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆ పార్టీకి భారీగా విరాళాలు లభించాయి. ఎన్సీపీ, బీఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో వాటిని పట్టించుకునే వారు లేరు. ప్రజా పోరాటాలకు ప్రాతినిధ్యం వహించే వామపక్ష పార్టీలకు లభించే విరాళాల్లో భారీ కోత పడుతోంది. రాజకీయంగా వాటి ప్రభావం పరిమితం కావడంతో వాటికి విరాళాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి.

ఎన్నికల సంఘం ఏంచేస్తున్నట్లు….?

పూర్తిస్థాయి స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘం విరాళాల విషయంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. పూర్తి వివరాలు, ఆధారాలు, పాన్ నెంబర్ లేని విరాళాలను సీజ్ చేయకుండా నిర్లిప్తంగా ఉంటోంది. పూర్తి వివరాలను సమర్పించని పార్టీలను ప్రాసిక్యూట్ చేయకుండా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం సడలిపోతోంది. ఇటీవల గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సభ్యుల క్రాస్ ఓటింగ్ విషయంలో ఎన్నికల సంఘం గట్టిగా వ్యవహరించి పలువురి ప్రశంసలందుకుంది. అదే తరహా క్రియాశీలతను విరాళాల విషయంలోనూ ప్రదర్శించాల్సి ఉంది. ప్రస్తుత కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి అచల్ కుమార్ జోతి ఒకప్పుడు గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారే. మోడీ గుజరాత్ సిఎం గా ఉన్నప్పుడు ఆయన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయినా రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను అడ్డుకున్నారు. అదే తరహా వైఖరి విరాళాల విషయంలో కూడా అనుసరిస్తే అందరూ హర్షిస్తారు.

 

        – ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1