మోడీ సర్కార్ను భయపెడుతున్న అంకెలు…పద్దులు

అయిదేళ్ల కనిష్ఠానికి పడి పోయిన పారిశ్రామిక వృద్ధి. మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన స్థూలజాతీయోత్పతి. విదేశీ మారక నిల్వల రాకపోకల్లో పెరుగుతున్న అంతరం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిన్నమొన్నటి వరకూ పొందిన గుర్తింపు హుష్ కాకి. రికార్డు చేజారిపోయింది. ఉపాధి కల్పనలో నెగటివ్ గ్రోత్. వస్తువుల రేట్లు పెరుగుతూ పుంజుకుంటున్న ద్రవ్యోల్బణం. ఇవన్నీ దేనికి సంకేతాలు. ‘అంతా బాగుంది. దేశం పరుగులు తీస్తోంది. ప్రపంచానికి సవాల్ విసురుతోంది‘ అంటూ కేంద్రం చెబుతున్న మాటల్లోని డొల్లతనానికి నిదర్శనాలు. వాస్తవానికి, ఊహాజనిత స్వప్నాలకు మధ్య నెలకొన్న అగాధం అంకెల రూపంలో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అధినేతలను భయపెడుతోంది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా , ఆర్థికంగా చాలా అంశాలు పాలకులకు కలిసివచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దారుణంగా పడిపోయాయి. అయినా ఆ లాభాన్ని ప్రజలకు బదలాయించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానా నింపుకున్నాయి. రాజకీయ స్థిరత్వం కారణంగా ఆర్థికంగా ముందంజ వేసే నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు చిక్కింది. కానీ దుస్సాహసంతో కూడిన దుందుడుకు నిర్ణయాలతో అనుకూల అవకాశాలను ప్రతికూల పరిస్థితులుగా మార్చుకుంటూ చేతులారా చెడగొట్టుకున్నారు కేంద్ర పెద్దలు.

మేక్ ఇన్ ఇండియా ఉత్తుత్తిదేనా?

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న చైనా మందగమనంలో పడింది. దీనిని సానుకూలంగా మలచుకుంటూ భారత దేశం సవాల్ విసురుతుందని ప్రపంచమంతా భావించింది. నోట్ల రద్దు నిర్ణయంతో ఒక్కసారిగా ద్రవ్యలభ్యతను, ఉపాధి కల్పనను దెబ్బతీసుకోవడంతో పరుగులు తీస్తున్న జవనాశ్వానికి పగ్గాలు వేసినట్లయిపోయింది. దేశంలో జరిగే ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పత్తి,సేవల విలువ జీడీపీ రూపంలో ఏడాదికి 140 లక్షల కోట్ల మేరకు ఉంటుందని అంచనా. ఏటా దీని వృద్ధిరేటు ఎంతగా పెరుగుతుంటే అంతగా అభివృద్ధి చెందుతున్నట్లుగా లెక్కిస్తారు. నోట్ల రద్దు, ఒకే దేశం- ఒకే పన్ను పేరుతో అమలు చేసిన జీఎస్టీ ల తర్వాత జాతీయోత్పత్తి వృద్ధి 5.7 శాతానికి పడిపోయింది. అంతకుముందు సంవత్సరాల్లో ఇది 7.5 శాతం మేరకు ఉండేది. దీనిని అంకెల్లోకి మార్చితే రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉత్పత్తి సేవలు, ఎగుమతి,దిగుమతుల రూపంలో ఆర్థిక వ్యవస్థ కోల్పోయినట్లే భావించాల్సి ఉంటుంది. మన తలసరి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని ఉపాధి కల్పనకు ముడిపెడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడున్నర కోట్ల మంది ఉపాధికి విఘాతం కలిగినట్లే. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన తమ అజెండా అంటూ ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించిన కమలనాథులు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎంతమందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించారంటే అంజనం వేయాల్సిందే. కానీ ఏడున్నర కోట్ల మంది కడుపు కొట్టినట్లు మాత్రం జీడీపీ నిరూపిస్తోంది. మేకిన్ ఇండియా పేరిట మోడీ సర్కారు చేపట్టిన పథకాలు ప్రచారానికే పరిమితమయ్యాయి. ఇక్కడ కొత్తగా ఉత్పత్తి రంగం అభివ్రుద్ధి చెందింది లేదు. కానీ వస్తు వినియోగం పెంచే దిశలో ఫారిన్ కంపెనీలకు కొత్త కన్స్యూమర్లను విచ్చలవిడిగా పెంచే చర్యలు మాత్రం పుంజుకున్నాయి. 2014 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ మన దేశంలోకి పదిన్నర లక్షల కోట్ల రూపాయల మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇందులో 60 శాతం మేరకు ఎక్కువ అస్థిరత కనబరిచే ప్రయివేటు ఈక్విటీల రూపంలో వచ్చిన నిధులే. లాభాపేక్షతో ఫ్లిప్ కార్ట్, పేటీఎం, స్నాప్ డీల్ వంటి సంస్థలకు అధికమొత్తాలు సమకూరాయి. ఇవేమీ దేశీయంగా ఉత్పత్తిరంగంలోకి వచ్చిన పెట్టుబడులు కావు. కన్స్పూమరిజం పెంచే పెట్టుబడులు. అందువల్ల విదేశీ పెట్టుబడుల రూపంలో కూడా మేకిన్ ఇండియా డొల్లగా తేలిపోయింది.

జీఎస్టీతో హళ్లికి…హళ్లి…డొల్లకు…డొల్ల…..

నోట్ల రద్దు దెబ్బ నుంచి దేశం తేరుకోక ముందే వస్తుసేవల పన్ను కొత్త దెబ్బ కొట్టింది. జులై నుంచి ఇప్పటివరకూ 15 నుంచి 20 శాతం ఆదాయం పడిపోయిందని వివిధ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. జీఎస్ టీ అమల్లోకి తెచ్చేందుకు పూర్తిస్థాయిలో సాంకేతికంగా దేశం ఇంకా సిద్ధం కాలేదు. సమస్యలు వెన్నాడుతున్నాయి. కేంద్రం డాంబికాలు పోతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక జులై నెలలోనే 95 వేల కోట్ల రూపాయల వరకూ దేశవ్యాప్తంగా పన్ను ఆదాయం లభించిందని లెక్కల చిట్టా విప్పింది. జీఎస్టీ అమల్లోకి రాకముందు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి ట్రాన్సిషనల్ టాక్స్ క్రెడిట్ గా 65 వేల కోట్ల రూపాయలు తమకు తిరిగి ఇవ్వాలని ట్రేడర్లు క్లెయిం చేస్తున్నారు. ఇది వారికి చట్టబద్ధమైన హక్కే. ఈ క్లెయిములను పరిష్కరిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 30 వేల కోట్లుగా తేలుతుంది. హళ్లికి హళ్లి ..డొల్లకు డొల్ల. మరోవైపు జీఎస్టీ అమలు వల్ల ధరలు తగ్గకపోగా వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి సంకేతం. సామాన్యుడు నిరాశ చెందుతున్నాడు. ఆసియాలోని ఇతరదేశాలతో పోలిస్తే మనదేశంలో వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రుణాలతో విదేశీ వర్తక వాణిజ్యాలు చేసే ఎగుమతి దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా లాభదాయకత కోల్పోతున్నారు. ప్రపంచ దేశాలతో పోటీతత్వం కనబరచలేకపోతున్నారు. ఈ రకంగా ఏ రంగంలో చూసినా నిరాశా పూరిత వాతావరణం ,ఆర్థికంగా మందగమనం కనిపిస్తున్నాయి.

మరింత దిగజారుతుందా?

తాజాగా స్టేట్ బ్యాంకుఆప్ ఇండియా పరిశోధన పత్రం వెల్లడించిన అంశాలు ఈ పరిస్థితులన్నిటికీ అద్దం పడుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ఆర్థిక రంగానికి జవసత్తువలు కల్పించే పునరుద్దీప పథకం గురించి ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2008 లో అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పుడు నిర్దిష్ట ఆదాయపరిమితిలో ఉన్న పౌరులకు మూడొందల డాలర్ల మేరకు పన్ను రాయితీలు కల్పించారు ఆ దేశాధ్యక్షుడు బుష్. ఉపాధి కల్పన, వస్తువినియోగం పెరిగేందుకు చర్యలు తీసుకున్నారు. తద్వారా ఎకానమీలో చలనం, మారకం పెరిగేలా చూసుకున్నారు. ఒక ఉత్సాహం, ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే భారతదేశం వంటి వర్థమాన ఆర్థిక వ్యవస్థకు ఇంతటి సాహసోపేత నిర్ణయాలు సాధ్యంకాకపోవచ్చు. చమురుదిగుమతుల్లో వచ్చే లాభాలనే వడిసిపట్టి ప్రజల జేబులు చిల్లు పెడుతున్న ప్రభుత్వం పౌరులకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తుందని భావించడం దురాశే. అయితే అక్టోబర్ నాలుగోతేదీన రిజర్వు బ్యాంకు పరపతి విధాన ప్రకటన సందర్భంగా వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యలతో కొంతమేరకు ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నించవచ్చని వ్యాపార,పారిశ్రామిక రంగాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ చర్య పడిపోతున్న ఆర్థిక పతనాన్ని ఎంతమేరకు నియంత్రించగలదో, నిలువరించగలదో వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*