మ‌జ్లిస్‌ను కాంగ్రెస్ ఇలా దెబ్బేస్తుందా…?

తెలంగాణ‌లో రాజ‌కీయాలు కాక పుట్టిస్తున్నాయి. ముందుగానే వ‌స్తాయ‌ని భావిస్తున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు తోడు రాష్ట్ర అధికార పార్టీ కూడా ముంద‌స్తుకు రెడీ అయిపోతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టికే రాజ‌కీయ వేడి పెరిగింది. ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల‌పై తీవ్ర‌మైన ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికిగాను అవ‌స‌ర‌మైన అన్ని అస్త్ర శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంది. ఇత‌ర పార్టీల నుంచి గెలుపు గుర్రాలు అన‌ద‌గ్గ వారికి వ‌లేసి మ‌రీ పార్టీలో చేర్చుకుంది. ఇంకా ఇప్ప‌టికీ గెలిచేవారికి వ‌ల‌విసిరేందుకు అన్నీ సిద్ధం కూడా చేసుకుంది. ఇక‌, కాంగ్రెస్‌కు కంట్లో న‌లుసుగా మారిన ఎంఐఎం పార్టీని ఓడించేందుకు కూడా నేతలు రంగం రెడీ చేసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

ఒవైసీ కోటను బద్దలు కొట్టాలని….

హైద‌రాబాద్ లోక్‌స‌భ స్థానం అత్యంత కీల‌కంగా మారింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే, గ‌త కొన్నేళ్లుగా ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎంఐఎంకు పూర్తి అండ‌గా నిలుస్తోంది. ముస్లిం ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ ఎంఐఎంకు అనుకూల ఓటింగ్ ఎక్కువ‌. అయితే, ఇక్క‌డ కాంగ్రెస్ త‌న పావులు క‌ద‌పాలాని, ఎంఐఎంను ఇక్క‌డే ఓడించి ఈ పార్టీ నేత‌ల‌కు బుద్ధి చెప్పాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డి నుంచి ఎంపీగా ఉన్న ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఒవైసీని ఓడించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ఇదే జ‌రిగితే.. ద‌శాబ్దాలుగా ఉన్న అస‌దుద్దీన్ హ‌వాకు బ్రేక్ ప‌డుతుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే అస‌దుద్దీన్‌కు పోటాపోటీగా ఉంచేలా.. మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌ను కాంగ్రెస్ బ‌రిలోకి దింపాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

అజర్ తో చర్చలు….

దీనిపై ఇప్ప‌టికే అజర్‌తో టీ కాంగ్రెస్‌ నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి గెలిచిన అజారుద్దీన్‌.. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో ఓడిపోయారు. అజారుద్దీన్‌ను హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అసదుద్దీన్‌ ఒవైసీపై పోటీకి దింపితే పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ సీట్లలో పట్టు బిగించడంతోపాటు, కాంగ్రెస్‌ జెండా ఎగురవేయవచ్చని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అజర్‌ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం.

మైనారిటీ ఓట్ల కోసం…..

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అజారుద్దీన్‌ను బరిలో దింపితే మైనారిటీ యవకులు కాంగ్రెస్‌ వైపు మళ్లీ అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు అంచనావేస్తున్నారు. హైద‌రాబాద్‌లో అజారుద్దీన్‌కు అటు ముస్లింల‌లోనే కాకుండా మిగిలిన వ‌ర్గాల్లో కూడా మాంచి క్రేజ్ ఉంది. అజార్ అయితేనే ఇక్క‌డ అస‌ద్‌ను ఢీ కొట్టేందుకు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి అవుతార‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. మొత్తంమీద హైదరాబాద్‌ పాతబస్తీలో మజ్లిస్‌ను దెబ్బతీసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ప్రణాళికలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో చూడాలి. మ‌రి అదేస‌మ‌యంలో ఎంఐఎం నేత‌లు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటారో చూడాలి.