రజనీపై ఫైర్ అవుతున్న పొలిటికల్ పార్టీలు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు తమిళనాడులో కాక పుట్టించాయి. రజనీ కొందరి నేతలను ప్రస్తావిస్తూ వారిని పొగడటం కొన్ని పార్టీలకు ఆనందం తేగా, మిగిలిన పార్టీలు రజనీపై మండి పడుతున్నాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ సమర్ధ నేత అని రజనీ కొనియాడారు. తమిళనాడులో ఎందరో మంచి నేతలున్నారని, అందులో అన్సుమణి రాందాస్, తిరుమావళవన్, సీమాన్ లు పోరాట యోధులని పొగిడారు. దీనికి డీఎంకే సానుకూలంగా స్పందించింది. రజనీ కేవలం కొందరినేతలను మాత్రమే తన ప్రసంగంలో పొగిడారు. ప్రధాని మోడీ, అన్నాడీఎంకే, కాంగ్రెస్ నేతల పేర్లను ప్రస్తావించలేదు. దీంతో తమిళనాడులో రజనీపై పొలిటికల్ పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి.

స్టాలిన్ ను ఎందుకు పొగిడారు?

రజనీ తన అభిమానులతో చివరి రోజు సమావేశంలో తనను ఎంతో ఆదరించిన తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు డీఎంకే నేత స్టాలిన్ ను పొగడటం మిగిలిన పార్టీలకు ఆగ్రహం తెప్పించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న మోడీ పేరును ఎందుకు ప్రస్తావించలేదని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ ప్రశ్నించారు. తనపై వచ్చే విమర్శలనే తట్టుకోలేని రజనీ రాజకీయాలకు పనికి రాడని పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన నేత మునుస్వామి ఫైర్ అయ్యారు. రజనీకి రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదని అన్నాడీఎంకే నేతలు విమర్శించారు. అన్నాడీఎంకే పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయన్న రజనీమాటలను వారు తప్పుపట్టారు. దేశంలోనే తమిళనాడులో శాంతిభద్రతలు బాగున్న విషయాన్ని అన్నాడీఎంకే నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద రజనీ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలను వేడెక్కించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*