రజనీ మరోసారి…మళ్లీ…మళ్లీ…!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏదీ తేల్చేట్లు లేరు. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్నదానిపై పూర్తిగా స్పష్టత రాలేదు. అయితే రజనీ మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వెళుతున్నారు. తాజాగా ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకూ మరోసారి రజనీకాంత్ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. చెన్నైలోని రాఘవేంద్ర ఆడిటోరియంలో రజనీమరోసారి భేటీ అవుతున్నారు.

ఈసారైనా స్పష్టత వచ్చేనా?

గతంలోనూ రజనీకాంత్ అభిమానులతో సమావేశమయ్యారు. అందరితో సెల్ఫీలు దిగారు. తన మనసులో మాటను కూడా బయటపెట్టారు. యుద్ధానికి సిద్ధంగా ఉండమని పిలుపునిచ్చారు. కాని అది ముగిసి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా రజనీ రాజకీయ అరంగేట్రంపై ఎటువంటి ముందడుగు పడలేదు. ఆయన జనవరిలో రాజకీయంలోకి ఎంట్రీపై స్పష్టత ఇస్తారని ఆయన సోదరుడు చెబుతున్నారు. తమిళనాడులో ఇప్పటికే సాటి నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కాని రజనీకాంత్ మాత్రం ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

అభిమానులతో సమావేశాలు….

అయితే తాజాగా జరుగుతున్న సమావేశాల్లో మరింత స్పష్టతను రజనీకాంత్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన కాంచీపురం, కృష్ణగిరి, ధర్మపురి, తిరువళ్లూరు అభిమానులతో భేటీ అవుతారు. 27వ తేదీన పుదుకోటైట, రామనాధపురం, నాగపట్నం, తిరువారూర్ అభిమానులతోనూ, 28న మధురై, సేలం, నామక్కల్ అభిమానులతోనూ, 29న ఈరోడు, వెల్లూరు, కోయంబత్తూరు, 30న ఉత్తర చెన్నై, 31వ తేదీన దక్షిణ చెన్నై అభిమానులను వరుసగా రజనీ కలవనున్నారు. అయితే ఈసారి తలైవా పాలిటిక్స్ పై కొంత స్పష్టత వచ్చే అవకాశముందని అభిమానులు ఆశపడుతున్నారు.ఈసారైనా రజనీ అభిమానుల కోరికను నెరవేరుస్తారా? లేదా? అన్నది ఈ నెల 26న తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*