రజనీ రెడీ… జ‌న‌వ‌రి 1న ప్రక‌ట‌నే…!

తమిళనాడు రాజకీయాలు మరింత వేగంగా మారనున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ విజయం సాధించడంతో అన్నాడీఎంకేలో ముసలం బయలుదేరింది. ప్రభుత్వం మూడు నెలల్లో కూలి పోతుందన్న ప్రకటనా సంచలనమయింది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే ఆర్కే నగర్ లో డిపాజిట్ కోల్పోయింది. దీంతో ఇక్కడ రాజకీయంగా స్పేస్ ఉందని అర్థమైపోయింది. దీంతో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపైనే సర్వత్రా చర్చ జరుగుతుంది. దీంతో నేటి నుంచి రజనీ తన అభిమానులతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశాలు డిసెంబర్ 31వ తేదీ వరకూ జరగనున్నాయి.

అభిమానులతో సమావేశాలు ముగిశాక….

అయితే జనవరి ఒకటో తేదీన పార్టీని రజనీ ప్రకటిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. రజనీసోదరుడు సత్యనారాయణ కూడా గతంలో రజనీ పార్టీని జనవరిలో ప్రకటిస్తారని తెలపడం ఇందుకు అద్దం పడుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల ఫలితం తర్వాత రజనీ రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తారన్న ధీమా రజనీ అభిమానుల్లో మరింత పెరిగింది. రజనీ రాజకీయ అరంగేట్రంపై స్పష్టత ఇస్తే తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటికే రజనీ పార్టీలో చేరేందుకు అన్నాడీఎంకే లో అనేకమంది నేతలు ఆసక్తి కనపరుస్తున్నారు. మరికొంతమంది రజనీతో టచ్ లోకి వెళ్లారు.

తమిళనాట అంతటా ఆసక్తి…..

తమిళనాడులో అన్నాదురై మొదలుకొని కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత వరకు తమిళనాట తిరుగులేని సీఎంగా తమ ప్రస్థానాన్ని కొనసాగించారు. అయితే జయలలిత తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. తమిళుల హృదయాల్లో తిరుగులేని నేతగా నిలిచిపోయారు. డీఎంకేతో విభేదాలు రావడంతో ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారు. పార్టీ స్థాపనలో ఎంజీఆర్‌కు జయలలిత వెన్నుదన్నుగా నిలిచారు. ఎంజీఆర్ మరణానంతరం ఆమె అన్నాడీఎంకేకు తిరుగులేని విజయాలు అందించారు.ఇక‌, ఇప్పుడు త‌లైవా ర‌జ‌నీ కూడా కొత్త పార్టీ పెడితే బాగుంటుంద‌నే అభిప్రాయం ప్రజ‌ల్లో ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయ‌న స్వయంగా పార్టీ పెడితే త‌మ కూసాలు క‌దిలిపోతాయ‌ని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లు ర‌జ‌నీని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ప్రయ‌త్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో రజనీ నేటి నుంచి అభిమానులతో సమావేశాలు కావడం ఆసక్తి రేపుతోంది. కొత్త ఏడాది తలైవా నుంచి ప్రకటన ఉంటుందంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*