రాంగ్ టైమ్ లో ఏపీలో రాహుల్ సభ

ఆంధ్రప్రదేశ్ కు రాక..రాక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ వస్తున్నారు. అయితే రాంగ్ టైమ్ లో వస్తున్నారు. ఏపీలో నేడు రాహుల్ సభ గుంటూరులో జరగనుంది. అయితే రాహుల్ ప్రసంగాన్ని వినే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటారా? దాయాదుల పోరు నేడు జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ నేడు మధ్యాహ్నం 3గంటల నుంచి బర్మింగ్ హామ్ లో ప్రారంభం కానుంది. రాత్రి పది గంటల వరకూ ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. సాధారణంగా క్రికెట్ అంటేనే పిచ్చెక్కి పోయే జనం ఉన్న ఏపీలో ఇక టీవీలన్నీ క్రికెట్ మ్యాచ్ కే ట్యూన్ అవుతాయి. అందులో ఏమాత్రం సందేహంలేదు. ఇక యువకులు కూడా రాహుల్ సభకు వచ్చే అవకాశం లేదంటున్నారు. క్రికెట్ అంటే పడి చచ్చే యువకులు…అందులోనూ పాక్, భారత్ మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కు పోతారు. ఇక రాహుల్ ప్రసంగం ఏం వింటారు? అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.

ప్రసంగం ఎంత మంది వింటారో?

అసలు ఏపీలో కాంగ్రెస్ కు కష్టాలు వీడటమే లేదు. తొలుత జూన్ 2 వతేదీన భీమవరంలో రాహుల్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పెడదామనుకున్నారు. కాని రాహుల్ అపాయింట్ మెంట్ దొరకలేదు. అయితే నాలుగో తేదీకి గుంటూరుకు వేదికను మార్చారు. రాహుల్ ఎటూ 3వ తేదీన డీఎంకే అధినేత కరుణానిధి జన్మదిన ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉండటంతో అక్కడి నుంచి నేరుగా గుంటూరు చేరుకోవచ్చని 4వ తేదీన బహిరంగ సభ చేశారు. అయితే అదేరోజు భారత్, పాక్ మ్యాచ్ ఉంటుందని నిర్వాహకులు గుర్తించలేకపోయారు. రాహుల్ ఎట్టిపరిస్థితుల్లో సాయంత్రం ప్రసంగించి తీరాల్సి ఉంది. ఆ సమయంలో పాక్, భారత్ మ్యాచ్ జరుగుతుంటోంది. దీంతో రాహుల్ ప్రసంగం ఏపీలో ఎక్కువ శాతం మంది ప్రజలు వినే అవకాశం ఉండదన్నది తేలిపోయింది. అదృష్టం ఆరడుగుల దూరంలో ఉంటే దరిద్రం వచ్చి తలుపుతట్టినట్లుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి అని ఆ పార్టీ నేతలే చెప్పుకోవడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*