రాజకీయ ఛత్రం ..దక్షిణాది ఆత్రం

ముఖ్యంగా మూడు రాష్ట్రాలు దక్షిణాది రాజకీయ పతాకను ఢిల్లీలో ఎగరేయాలని చూస్తున్నాయి. ఆశలు, ఆశయాలు, అభిరుచులు వేరైనప్పటికీ సొంత పంథాతో అస్తిత్వాన్ని చాటుకోవాలని తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్, తమిళనాడులోని ప్రధాన ప్రాంతీయ పార్టీలు నేషనల్ రోల్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ సెక్యులర్ ఫ్రంట్ పేరిట చేయి ఎత్తారు. ఆచితూచి అన్నీ సక్సెస్ అనుకుంటే మాత్రమే నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు నాయుడు సైతం అవసరమైతే రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎంజీఆర్ పాలనను తెస్తానంటూ ప్రకటించిన రజనీ సహజంగానే జాతీయ స్థాయి గ్లామర్ తో మీడియా ప్రచారంలో వెలిగిపోతున్నారు. వీరికున్న అవకాశాలు, బలాబలాలు, సమీకరణలపై చర్చ మొదలైపోయింది. సీనియారిటీ, పొలిటికల్ ఎక్స్ పీరియన్స్ దృష్ట్యా తమ నేత చుట్టూ ప్రాంతీయ పార్టీలు జట్టు కడతాయనే భావనలో ఉంది తెలుగుదేశం. తెలంగాణలో తిరుగులేని నాయకునిగా ఎదిగిన కేసీఆర్ దూకుడు, వ్యూహరచనల ముందు మిగిలిన పార్టీలు మోకరిల్లుతాయనే ఆత్మవిశ్వాసాన్ని వెల్లడిస్తున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. సిన్సియారిటీ, జీవనశైలి, దక్షిణాదిలోనే పెద్ద రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రజనీకాంత్ కూడా ఎంజీఆర్ తర్వాత రికార్డు సృష్టిస్తారనేది ఆయన అభిమానుల అంతరంగం. మొత్తమ్మీద ఈ ముగ్గురికీ కొన్ని పోలికలు, సన్నిహిత సంబంధాలు ఉండటం విశేషం.

కేసీఆర్ కేంద్రంగా…

కొంతకాలంగా దేశ రాజకీయాల్లో స్తబ్దత నెలకొంది. కాంగ్రెసు లో జోరు లోపించింది. బీజేపీ,మోడీ హవా ఎదురులేకుండా సాగిపోతోంది. విపక్షాలన్నీ డీలాపడిపోయి ఉన్నాయి. అటువంటి స్థితిలో కేసీఆర్ ఇచ్చిన డేరింగ్ స్టేట్ మెంట్ కొత్త ఆశలకు ఊపిరిపోసింది. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగిపోతోందని భావించిన కేసీఆర్ భారత రాజకీయాలపై దృష్టి సారించారు. అధ్యయనశీలి అయిన ముఖ్యమంత్రి తన పరిధిని, పాత్రను విస్తరించుకోవాలని భావిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 34 జాతీయ పార్టీలతో తెలంగాణ విషయంలో చర్చించి వారందరినీ కూడగట్టిన అనుభవం కేసీఆర్ కు ఉంది. బీజేపీ, కాంగ్రెసులకు వ్యతిరేకం అన్న ముద్ర కాకుండా ప్రత్యామ్నాయ అజెండాను సిద్దం చేసుకుని రంగంలోకి దిగాలనేది కేసీఆర్ యోచన. జపాన్, చైనా, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నమూనాలను పరిశీలించి సమగ్ర వ్యవసాయ, అభివృద్ధి ప్రణాళికను దేశ ప్రజల ముందుకు తేవాలనే దిశలో ఆయన ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. సెక్యులర్ ఫ్రంట్ కు ఈ అజెండానే ప్రధాన బలంగా ఉంటుందని చెబుతున్నారు.చిన్నాచితకా పార్టీలను ఆకర్షించేందుకు , ప్రజల్లో చర్చ రేకెత్తించేందుకు ఇదే మూలమవుతుందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రకు పూర్తి భిన్నమైన రోల్ లోకి కేసీఆర్ రూపాంతరం చెందుతారని దేశ రాజకీయాలనే మలుపు తిప్పుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బాబుకు భలే చాన్సు…

ఎనిమిదో దశకంలోనే మంత్రిగా రాజకీయం చేసిన చంద్రబాబు తొమ్మిదోదశకంలోనే జాతీయ పాత్రలోకి మారారు. ఎన్టీయార్ నేషనల్ ఫ్రంట్ ను తీర్చిదిద్దిన సమయంలోనూ తెరవెనక చంద్రబాబు చాలాకీలకంగా వ్యవహరించారు. సంకీర్ణప్రభుత్వాల శకంలో కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్నారు. బీజేపీతో సంబంధాలు దెబ్బతిన్నాయి. కాంగ్రెసుతో కలవడంలో సెంటిమెంట్లు అడ్డు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బాబును నేషనల్ రోల్ లోకి రమ్మని అనేకమంది నాయకులు ఆహ్వానిస్తున్నారు. విస్తృతమైన సంబంధాలు కలిగి ఉండటం, వ్యూహరచన అతని ప్రధాన బలం. మోడీకి దీటైన నాయకునిగా అప్పుడే ప్రచారం కూడా ప్రారంభమైంది. కార్పొరేట్ వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండటమూ అదనపు ఆకర్షణే. దేశంలో తొలి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న చంద్రబాబుకు జాతీయ మీడియా అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. ప్రత్యేక ప్లాట్ ఫామ్ నెలకొల్ప గలిగితే చంద్రబాబు మూడో ఫ్రంట్ ను సమర్థంగా నడపగలరనే నమ్మకాన్ని టీడీపీ వర్గాలే కాకుండా ఇతర ప్రాంతీయ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. కరుణానిధిని మినహాయిస్తే దక్షిణాదిన ఉన్న నాయకులందరికంటే సీనియర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పనిచేశారు. దక్షిణాదిన కొత్త పార్టీతో బరిలోకి దిగుతున్న రజనీకాంత్ వంటి వారితో సన్నిహిత సంబంధాలున్నాయి. 1995లో ఎన్టీయార్ ను గద్దె దించే సమయంలో చంద్రబాబు తరఫున రజనీకాంత్ ఎన్టీఆర్ తో చర్చలు నడిపి మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కూడా చేశారు. ఇవన్నీ ఆంధ్రా సీఎంకు కలిసొచ్చే అంశాలే.

రజనీకి రాచమార్గం…

మాస్ ఫాలోయింగ్ లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచే సినీ నటుడు రజనీకాంత్. తమిళనాట రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా తమిళనాడును శాసించిన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా నూతన రాజకీయ శక్తిగా ఆవిర్భవించేందుకు సూపర్ స్టార్ కు సమయం, సందర్బం కలిసి వస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఏఐఏడీఎంకే రాజకీయ ఉనికిని కోల్పోతోంది. అధికారంలో ఉన్న పార్టీకి ఇటువంటి దురవస్థ ఎవరూ ఊహించనిది. కరుణానిధి క్రియాశీలక పాత్ర నుంచి తప్పుకోవడంతో డీఎంకే కూడా బలహీనపడింది. అవినీతికి మారుపేరుగా పడిన ముద్ర నుంచి బయటపడలేకపోతోంది. క్లీన్ ఇమేజ్ తో అత్యంత ఆకర్షణ కలిగిన సినిమా నటుడైన రజనీ కాంత్ నిస్వార్థ పరుడు, నిరాడంబరుడు అని తమిళనాట మెజార్టీ ప్రజలు అభిమానిస్తారు. ఇది రాజకీయంగా కలిసొచ్చేఅంశంగా కనిపిస్తోంది. జాతీయ పార్టీలను పూర్తిగా తిరస్కరించే తమిళనాట ఒక కొత్త పార్టీకి ఇప్పుడున్నన్ని అవకాశాలు గతంలో ఎప్పుడూ లేవు. డీఎంకే,ఏఐడీఏంకే ల మధ్యనే గతంలో పోటీ ప్రధానంగా కేంద్రీక్రుతమై ఉంటుండేది. చక్కని ప్రణాళికతో వ్యూహరచన చేసుకుంటే రజనీ రాజకీయం మంచి ఫలితాన్నిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శివాజీ గణేశన్, విజయకాంత్ వంటి వారు పార్టీలు పెట్టినప్పుడు పొలిటికల్ స్పేస్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏర్పడిన రాజకీయ శూన్యత, స్తబ్దతలే రజనీకి వరంగా మారతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*