రాజకీయ తేనెతుట్టను కదిల్చిన ముఖ్యమంత్రి

రాజకీయ తేనెతుట్టను కదిల్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అధికారం విషయంలో సముచిత స్థానం ఇవ్వకపోయినా ఓట్ల విషయంలో బడుగుబలహీన మైనారిటీ వర్గాలపై అపరిమిత మైన ప్రేమ, అవ్యాజ్యమైన కరుణ చూపించడం రాజకీయపక్షాలకు పరిపాటే. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల కాలవ్యవధి ఉంది. ఈలోపు తన ఓటు బ్యాంకును పటిష్ఠం చేసుకునేందుకు, నూతన వర్గాలను ఆకర్షించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే మైనారిటీ రిజర్వేషన్ల అంశాన్ని మళ్లీ ముందుకు తెచ్చిపెట్టారాయన. ఎన్నికల ప్రణాళిక అమలులో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నామన్నారు.

నిజానికి మైనారిటీ రిజర్వేషన్ల మాటెత్తితే కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులకు చిర్రెత్తుకొస్తుంది. పైపెచ్చు హిందూ ఓటు పోలరైజేషన్ కు బీజేపీకి ఇదో బ్రహ్మాస్త్రం. అయినా కేసీఆర్ సాహసిస్తున్నారంటే ఇందులోని ఆంతర్యం అర్థం చేసుకోవాల్సిందే. ఎన్నికల ప్రణాళికలో అమలు చేయాల్సిన అంశాలు సవాలక్ష ఉన్నప్పటికీ తక్షణం ఫలితం ఇచ్చే రిజర్వేషన్ల వంటి వివాదాస్పద అంశాలే రాజకీయులకు ముడిసరుకు. అమలు చేయడం సాధ్యమైనా, కాకపోయినా దీర్ఘకాలం ఆయా వర్గాల్లో నానుతుంది. పైపెచ్చు తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని చాటుకొనేందుకూ వీలుంటుంది. రాజ్యాంగపరమైన, న్యాయపరమైన ఆటంకాలు అనేకం ఉన్నప్పటికీ ముస్లింలలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల పేరిట రిజర్వేషన్ల అంశాన్ని చట్టబద్ధం చేసేందుకు పూనుకున్నారు కేసీఆర్. మొత్తమ్మీద రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసి ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెనకబడిన ముస్లిం లకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు సైతం సుప్రీం కోర్టు సమీక్షలో ఉన్నాయి. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో ఉంచి తమిళనాడు లో అమలు చేస్తున్న 69 శాతం రిజర్వేషన్ల అంశం కూడా సుప్రీం విచారణలో ఉంది. ఈశాన్య ప్రాంతాల్లో షెడ్యూల్డు తెగలకు చెందిన వారే అధిక సంఖ్యలో నివసిస్తున్న దృష్ట్యా వారి జనాభాను అనుసరించి రిజర్వేషన్ పెంచుకునేందుకు రాజ్యాంగమే అధికారం కల్పిస్తోంది. అందువల్ల అక్కడ 80, 90 శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ చెల్లుబాటు అవుతుంది. కానీ తెలంగాణకు ఆ వెసులుబాటు లేదు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా రిజర్వేషన్ అమలు చేస్తానంటూ కేసీఆర్ చేస్తున్న వాదన న్యాయసమీక్షలో తేలిపోతుందని స్వయంగా ఆయనకే తెలుసు. అయితే జనాభాలో 12 శాతం పైగా ఉన్న ముస్లిం మైనారిటీలను టీఆర్ఎస్ వైపు మళ్లించడానికి ఇదొక పాచికగా ఉపయోగించవచ్చుననే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

రాజ్యాంగపరంగా ఎటువంటి ఆటంకాలు లేని టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలోని అమలు చేయాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. భూమిలేని రాష్ట్రంలోని ఏడు లక్షల దళిత కుటుంబాలకు మూడేసి ఎకరాల చొప్పున భూమి ఇస్తామన్న వాగ్దానం నెరవేర్చాల్సి ఉంది. సొంత ఇళ్లు లేని 22 లక్షల కుటుంబాల నిరుపేదలకు రెండుపడకల ఇళ్లు కట్టించాల్సి ఉంది. వీటిపై ఎటువంటి వివాదాలు లేవు. అయినా ఆ దిశలో చర్యలు తీసుకోకుండా పొలిటికల్ ఈక్వేషన్ చూసుకోవడమే ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయమవుతోంది. గడచిన మూడు సంవత్సరాలుగా తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ ఆశతో,ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతంలో ముస్లిం పాలకులు శతాబ్దాలపాటు ఈ ప్రాంతాన్ని పాలించడం, పాలితులైన హిందువులు ద్వితీయశ్రేణి పౌరులుగా నలిగిపోవడం గత చరిత్ర. ఆ సెన్సిటివిటీ ఇంకా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు పేరు ఏదైనా తిరిగి మైనారిటీ ముస్లిం రిజర్వేషన్ల అంశం మెజారిటీ హిందువులను రెచ్చగొట్టడానికి ప్రేరణగా ఉపకరిస్తుంది. అయాచితంగా ఇటువంటి రాజకీయ ఆయుధం దొరికితే కమలదళం చూస్తూ ఊరుకోదు. పైపెచ్చు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత మంచి ఊపు మీదున్న బీజేపీకి తదుపరి ప్రయోగక్షేత్రం తెలంగాణ కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో హస్తవాసి కోల్పోతూ.. బలహీనపడుతున్న కాంగ్రెస్ స్థానంలో బలమైన బీజేపీ ప్రత్యర్థిని కేసీఆర్ చేజేతులారా ఆహ్వానిస్తున్నట్లుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*