రాజమౌళి ఎంట్రీతో ఊపిరి పీల్చుకున్న మంత్రి

అమరావతి రాజధాని నిర్మాణపు డిజైన్లు ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. రాజమౌళి చంద్రబాబు మనసులో మాటను గ్రహించారు కాబట్టే ఆయన అనుకున్నట్లుగానే డిజైన్లు రూపు దిద్దుకునేలా సినీ దర్శకుడు రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్లుగా రాజధాని డిజైన్లు ఒక కొలిక్కి రాలేదు. నార్మన్ పోస్టర్స్ సంస్థ ఎన్ని డిజైన్లు రూపొందించినా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని మళ్లీ….మళ్లీ మార్చాలని సూచించారు. ఆయన ఏం మార్పు కోరుకుంటున్నారో… ఇటు సీఆర్డీఏ అధికారులకు గాని, మంత్రి నారాయణకు గాని తెలియడం లేదు. నేరుగా చంద్రబాబునే ఏం మార్పు కోరుకుంటున్నారో అడిగే ధైర్యం లేదు. ఈ సమయంలో చంద్రబాబు సినీ దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని సూచించారు. రాజమౌళి ఎంట్రీతో కొంత క్లారిటీవచ్చినట్లయింది. రాజమౌళి చంద్రబాబుతో భేటీ అయినప్పుడు ఆయనకు ఏం కావాలో తెలుసుకున్నారు. అసెంబ్లీ, పరిపాలన భవనాలు, హైకోర్టు వంటి కట్టడాలు ఎలా ఉండాలన్నదానిపై రాజమౌళి సూటిగానే చంద్రబాబును ప్రశ్నించారు. నార్మన్ పోస్టర్స్ సంస్థ గతంలో రూపొందించిన డిజైన్లు బాగానే ఉన్నాయని, అయితే అందులో ముఖ్యమంత్రి కొన్ని మార్పులు కోరుకుంటున్నారని రాజమౌళి అధికారులకు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చంద్రబాబు మనసులో ఆకృతిని……

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజధానికి పునాది రాయి పడాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించి ముందడుగు పడితే వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తనకు అండగా నిలబడతారన్నది చంద్రబాబు వ్యూహం. ఈ నేపథ్యంలో రాజధానినిర్మాణపు పనులు శరవేగంతో ప్రారంభించాలని చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను, ఇటు మంత్రి నారాయణను నిద్రపోనివ్వలేదు. అయితే నార్మన్ పోస్టర్స్ సంస్థ చూపించిన డిజైన్లు ఏవీ అధినేతకు నచ్చకపోవడంతో అధికారులు, మంత్రి కంగుతిన్నారు. ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నారో తెలియక మధనపడ్డారు. చివరకు రాజమౌళి రంగ ప్రవేశం చేయడంతో ముఖ్యమంత్రి మనసులో ఉన్నది అర్థమై పోయింది. ప్రస్తుతం రాజమౌళి మంత్రి నారాయణ, సీఆర్డీఏ టీంతో కలిసి లండన్ లోని నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులకు రాజమౌళి ముఖ్యమంత్రి మనసులో ఉన్న ఆకృతులను… ఆలోచనలను వివరించారు. దీంతో రాజధాని డిజైన్లు ఇక ఖరారవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*