రాజుగారు నాకు తెలుసన్న పవన్ కల్యాణ్

కమ్యునిస్టులతో కలసి ప్రయాణించేందుకు జనసేన సిద్దమైంది. తమ్మినేని వీరభద్రంతో చర్చించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ప్రజాసమస్యలపై పోరాడటమే జనసేన లక్ష్యమని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ధర్నా చౌక్ ను తొలగించడం తప్పని జనసేనాని అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ నిరసనను తెలిపేందుకు ధర్నాలు చేస్తారని, ధర్నా చేయడం ప్రజల హక్కని పవన్ అభిప్రాయపడ్డారు. ధర్నా చౌక్ తరలింపుకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో జనసేన కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. అలాగే రైతు సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ కృషి చేయాలని, లేకుంటే రైతుల పక్షాన పోరాటం చేయక తప్పదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. శాంతియుతంగా జరిగే ధర్నాలు అడ్డుకోవడం సరికాదన్నారు. రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడాన్ని కూడా పవన్ ఖండించారు.

చిన్నచూపు చూడకూడదనే….

టీటీడీ ఈవో నియామకంపై కూడా పవన్ స్పందించారు. దక్షిణాది వారిని సెకండ్ సిటిజన్స్ గా చూడకూడదన్నదే తన అభిప్రాయమన్నారు. అంతేకాని తాను ఐఏఎస్ ల నియామకాలకు వ్యతిరేకం కాదని పవన్ కల్యాణ్ చెప్పారు. అలాగే ఉత్తరాదిలో దక్షిణాది వారికి కూడా పదవులు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ఉత్తరాదికి, హిందీకి తాను వ్యతిరేకం కాదని తెలిపారు. దక్షిణాది వారిని చిన్నచూపు చూడకూడదన్నదే తన అభిమతమని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ వద్ద కూడా ధైర్యంగా చెప్పగలనన్నారు. ఇక పవన్ అంటే ఎవరు? అని అడిగిన అశోక్ గజపతి రాజు తనకు తెలుసన్నారు. ఆయనకు నేనెవరో తెలియకపోయినా రాజు గారు నాకు బాగా తెలుసు అని చమత్కరించారు.