రాములమ్మ తీరు ఇక మారదా?

విజయశాంతి…. తెలంగాణ రాములమ్మ.. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న విజయశాంతి ఇటీవలే మళ్లీ తెరపైకి వచ్చారు. రెండు నెలల క్రితం రాహుల్ గాంధీని కలిసి పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. రాహుల్ గాంధీ సమక్షంలో తాను మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చారు. కాని రెండు నెలల నుంచి గాంధీ భవన్ ముఖం కూడా చూడలేదు. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు గాంధీభవన్ వర్గాలు మెసేజ్ పంపుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. డిసెంబరు 9వ తేదీన సోనియాగాంధీ జన్మదిన వేడుకలకు కూడా రాములమ్మ రానేలేదు.

కార్యక్రమాలకు డుమ్మా….

అయితే విజయశాంతికి పార్టీలో పెద్ద పదవి ఇస్తారన్న ప్రచారం నిన్మమొన్నటి వరకూ జరిగింది. ఆమె పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగిస్తారన్న టాక్ కూడా నడించింది. విజయశాంతి తొలి నుంచి అంతేనంటున్నారు పార్టీ నేతలు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి చురుగ్గా పాల్గొనేవారు. అప్పట్లో ఆమె ఎంపీగా ఉండటంతో తప్పనిసరిగా హాజరయ్యేవారు. అయితే కాంగ్రెస్ లో చేరి ఓటమి పాలయిన తర్వాత అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా ఆమెకే తెలియనిపరిస్థితి ఉంది. జిల్లాల్లో సభలు పెట్టి పిలిచినా విజయశాంతి హాజరు కాలేదు.

గుర్రుగా ఉన్న సీనియర్లు….

దీనిపై సీనియర్ నేతలు గుర్రుమంటున్నారు. విజయశాంతి వల్ల ఒరిగేదేమీ లేకపోయినా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ వద్దకు తీసుకు వెళ్లారని, దీంతో ఆమె పరపతిని మరింత పెంచాంటున్నారు సీనియర్లు. పార్టీకోసం నిరంతరం పనిచేసే తమను కాదని పార్ట్ టైం నేతలకు ప్రయారిటీ ఎందుకున్న ప్రశ్నలు అప్పడే బయలుదేరాయి. విజయశాంతికి అసలు పార్టీ కార్యక్రమాల గురించి పంపకపోవడమే మంచిదని కూడా కొందరు ఉత్తమ్ కు సూచించినట్లు చెబుతున్నారు. ఆమె ఆకర్షణ ఏమీ ఉండదని తొలి నుంచి కొందరు నేతలు ఉత్తమ్ చెవిలో పోరుపెడుతున్నారు.

సంక్రాంతి తర్వాత….

కాని విజయశాంతి సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి నచ్చజెప్పారు. జనవరి మూడో వారంలో తెలంగాణలో రాహుల్ సభ దాదాపుగా ఖరారయింది. వరంగల్ జిల్లాలోనే ఈ సభ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ సభ నుంచి విజయశాంతి ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఉత్తమ్ వర్గీయులు చెబుతున్నారు. మొత్తం మీద రాములమ్మ రాహుల్ సభ కోసం వెయిట్ చేస్తుందని మాత్రం లీకులు వెలువడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*