రాములమ్మ పంతం నెగ్గించుకుంటుందా?

కొత్తనీరు వ‌స్తే.. పాత‌నీరు వెన‌క్కి పోతుంద‌నేది సామెత‌!- కానీ, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ సామెత నిజం కానుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌.. దీనికి సంబంధించి ఎన్ని ఎత్తులు వేయాలో.. ఎన్ని ఫీట్లు చేయాలో అన్నీ చేస్తోంది. అప‌ర చాణిక్యుడుగా పేరొందిన టీడీపీ అధినేత చంద్ర‌బాబునే ఢీకొట్టిన నేత‌గా టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనుడు అంత వీజీ కాద‌ని గుర్తించిన టీ కాంగ్రెస్ నేత‌లు… కొత్త వారికి, యువ‌శ‌క్తికి, తెలంగాణ ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్ప‌గ‌లిగే చేవ ఉన్న‌వారికి ఛాన్స్ ఇవ్వాల‌ని అధిష్టానానికి నివేదిక‌లు పంపారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు.

రేవంత్ తన పని తాను….

రేవంత్ రాక‌తో కాంగ్రెస్ బ‌లోపేతం అవుతుంద‌ని, రాష్ట్రంలోని యువ‌శ‌క్తి, ముఖ్యంగా అధికార పార్టీ మంత్రి కేటీఆర్‌కు పోటీగా రేవంత్ యువ‌త‌ను కాంగ్రెస్ వైపు తిప్పుతాడ‌ని భావించారు. ఈ విష‌యంలో రేవంత్ త‌న ప్ర‌య‌త్నాల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. అయితే, ఇంత‌లోనే మ‌ళ్లీ గ‌తంలోనే కాంగ్రెస్‌లో చేరిన విజ‌య‌శాంతిని తిరిగి యాక్టివ్ చేయ‌డం ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకోవాలని భావించారు. ఈ క్ర‌మంలోనే ఆమెతో నేరుగా నేత‌లు మాట్లాడ‌కుండా పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌నే లైన్‌లోకి దింపి, ఆమెతో మాట్లాడించారు.ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి మ‌రీ రాహుల్‌తో భేటీ అయిన రాముల‌మ్మ‌.. పార్టీ అభివృద్ధికి త‌న‌వంతు కృషి చేసేందుకు ఓకే చెప్పారు.

షరతులకు అంగీకరించారా…?

ఇంత వ‌ర‌కు బాగానేఉన్నా.. రాముల‌మ్మ అంత తొంద‌ర‌గా ఇంత పెద్ద ప‌నికి ఎలా ఒప్పుకొన్నార‌నే విష‌యంపైనే సీనియ‌ర్లు ఆరా తీశారు. ఈ ఆరాలో అస‌లు విష‌యాలు కొన్ని వెలుగు చూశాయి. తాను ఒక నియోక‌వ‌ర్గానికి ప‌రిమితం కాన‌ని, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాన‌ని, త‌న ప‌ట్టు పెంచుకుంటాన‌ని, దీనికి ఓకే అనాల‌ని విజ‌య‌శాంతి రాహుల్‌కు చెప్పార‌ట‌. దీనికి ఆయ‌న రెండో మాట లేకుండా ఓకే చెప్పార‌ట‌. అదేవిధంగా పార్టీ అధికారంలోకి వ‌స్తే.. డిప్యూటీ సీఎం ప‌ద‌విని త‌న‌కు ఇవ్వాల‌ని కూడా రాముల‌మ్మ ష‌ర‌తు పెట్టార‌ట‌. అయితే, దీనిపై నేరుగా రాహుల్ హామీ ఇవ్వ‌లేద‌ని తెలిసింది.

సమయం వచ్చినప్పుడు….

అంతేకాదు, అధికారంలోకి వ‌చ్చాక మీరే క‌దా ప‌ద‌వులు అనుభ‌వించేది.. నేనేమీ పోటీకి రాను క‌దా.. త‌ప్ప‌కుండా ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు చూద్దామ‌ని రాహుల్ అన్న‌ట్టుగా సీనియ‌ర్లు తెలుసుకున్నార‌ట‌. దీంతో ఇప్పుడు విజ‌య‌శాంతి ఇక‌, రేపో మాపో.. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. బ‌స్సు యాత్ర‌, పాద‌యాత్ర లేదా మ‌రో పేరుతోనో ఆమె యాత్ర ప్రారంభించడం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో ఇప్పుడు సీనియ‌ర్లు.. త‌మ‌లో తామే త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. మేం మొద‌టి నుంచి ఉన్నాం.. మాకు ల‌భించ‌ని హామీలు ఈమెకు ఇవ్వ‌డం ఏంట‌ని వారిలో వారే స‌త‌మ‌త‌మవుతున్నార‌ట‌. మ‌రి ఈ నేప‌థ్యంలో వీరు రాముల‌మ్మ‌కు స‌హ‌క‌రిస్తారా? లేక నిర‌స‌న‌గా మౌనం పాటిస్తారా? చూడాలి. ఏదేమైనా.. రాముల‌మ్మ‌.. త‌న పంతం నెగ్గించుకుంటోంద‌న్న మాట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*