రాములమ్మ రానంటున్నారే….!

తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ నెల 26వ తేదీ నుంచి చేవెళ్ల నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. అయితే రాములమ్మ జాడ మాత్రం ఇంతవరకూ లేదు. అసలు బస్సు యాత్రలో విజయశాంతి పాల్గొంటుందా? లేదా? అన్న చర్చ కూడా కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. బస్సుయాత్రలో సీనియర్ నేతలందరూ పాల్గొనాలని ఇప్పటికే పీసీసీ పిలుపునిచ్చింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ ఆలీ, గీతారెడ్డితో చర్చించి చివరకు యాత్రను ఖరారు చేశారు. యాత్ర రూట్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది. గతంలో వైఎస్ చేపట్టిన పాదయాత్ర రూట్లోనే ఈ బస్సు యాత్రను కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు.

రాజకీయాలకు దూరంగా….

అయితే విజయశాంతి మాత్రం ఇంతవరకూ అయితా పయితా లేకపోవడం గాంధీ భవన్ లో చర్చనీయాంశమైంది. విజయశాంతి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. బయట ఎక్కడా కన్పించనే లేదు. ఇక పార్టీ కార్యక్రమాల్లో ఆమె జాడే లేదు. దాదాపు కాంగ్రెస్ నేతలు కూడా విజయశాంతి ఉన్నారన్న విషయాన్నే మర్చిపోయారు. గత ఏడాది జరిగిన రాహుల్ సభకు కూడా విజయశాంతి హాజరుకాలేదు. ఇక విజయశాంతి రాజకీయాలకు దూరమయినట్లేనని అందరూ భావించారు.

రాహుల్ ను కలిసిన తర్వాత….

అయితే కొద్దికాలం క్రితం విజయశాంతి రాహుల్ ను కలిశారు. తాను తిరిగి క్రియాశీలకంగా పార్టీలో వ్యవహరిస్తానని చెప్పారు. అయితే ఈ సందర్భంగా విజయశాంతి పార్టీలో ముఖ్యమైన పదవిని కోరినట్లు తెలిసింది. విజయశాంతికి ప్రచార బాధ్యతలను అప్పగిస్తారన్న ఊహాగానాలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అయితే ఇంతవరకూ రాహుల్ ఎటువంటి పదవి విజయశాంతికి ఇవ్వలేదు. దీంతో ఆమె తాను ప్రజల్లోకి వెళ్లాలంటే ఎలా? అని భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది. కనీసం బస్సు యాత్ర గురించి కూడా సమాచారం లేదని విజయశాంతి ఆవేదన చెందుతున్నారు.

పదవి లేకుండా ఎలా?

పదవి లేకుండా తాను గడప దాటనని విజయశాంతి తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఏ హోదాతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అందుకే ఈ నెల 26వ తేదీ నుంచి జరిగే బస్సు యాత్రలో విజయశాంతి పాల్గొనే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. ఇప్పట్లో పదవుల నియామకం చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది. మరి పీసీసీ నేతలు విజయశాంతిని ఒప్పించి బస్సుయాత్రకు తీసుకువస్తారా? లేదా వదిలేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. కాని విజయశాంతి గ్లామర్ యాత్రకు తోడవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*