రామ్ నాధ్ ఎంపిక పై కాంగ్రెస్ ఏమందంటే?

రాష్ట్రపతి అభ్యర్థి గా రామ్ నాధ్ కోవింద్ ను బీజేపీ ఎంపిక చేయడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఏకపక్ష నిర్ణయమని చెప్పింది. రామ్ నాధ్ పేరును బీజేపీ నియమించిన త్రిసభ్య కమిటీ తమకు పేరు చెప్పకుండా మద్దతివ్వాలని కోరడమేంటని ప్రశ్నించింది. ఏకాభిప్రాయ సాధన ఎలా సాధ్యమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్డీఏ అభ్యర్ధిగా ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా పనిచేస్తున్న రామనాధ్ కోవింద్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోడీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు. అయితే ఇది ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. అయితే రామ్ నాధ్ ఎంపికపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేత గులాంనబీ ఆజాద్ చెప్పారు. పార్టీలోనూ, విపక్షాలతోచర్చించిన తర్వాత తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామన్నారు.

ఎన్డీయేతర పక్షాల మద్దతు రామ్ నాధ్ కే….

కాంగ్రెస్ అభిప్రాయాన్ని బట్టి చూస్తుంటే విపక్షాలు తమ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉందని పిస్తోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తమ అభ్యర్థిని నిలిపే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. అయితే రామ్ నాధ్ ఎంపికపై దేశంలో సానుకూలత వ్యక్తమవుతోంది. ఏన్డీయేతర పక్షాలు కూడా ఇప్పటికే రామ్ నాధ్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రసమితి రామ్ నాధ్ కు మద్దతు తెలపగా, ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా రామ్ నాధ్ కు జై కొట్టింది.వైసీపీ అధినేత జగన్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. దీనికి జగన్ తాము రామ్ నాధ్ కూ పూర్తి మద్దతిస్తామని ప్రకటించారు. అలాగే బిజూ జనతా దళ్ కూడా మద్దతిచ్చే అవకాశాలున్నాయి. తమిళనాడులోని అన్నాడీఎంకే సయితం ప్రధాని మోడీ ఫోన్ కు సానుకూలంగా స్పందించారు. దీంతో ఎన్నిక జరిగినా రామ్ నాధ్ ఎన్నికకు అవసరమైన ఎలక్ట్రోరల్ ఓట్లు ఇప్పటికే ఎన్డీఏ ఖాతాలో చేరిపోయాయి. దీంతో విపక్షాలు మరో అభ్యర్ధి పోటీకి నిలిపినా ఫలితం లేనట్లే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1