రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయం ఇంకా కాలేదట

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. పార్టీ అభ్యర్థి ఎవరన్నదీ ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుంది. జులై 17వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అయితే ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థి ఎంపికపై ఇంకా క్లారిటీ రాలేదు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థినే ఎంపిక చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షా భావిస్తుండటంతో పార్టీ సీనియర్ నేతలతో కూడా దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇటీవలే అమిత్ షా నాగ్ పూర్ పర్యటనలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా కలిసి వచ్పారు. ఆయన అభిప్రాయాన్ని కూడా షా సేకరించినట్లు చెబుతున్నారు.

ద్రౌపది ముర్ముకే ఛాన్స్?…..

అయితే రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ద్రౌపది ముర్ము పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. ద్రౌపది ముర్ము గిరిజన నేత. జార్ఖండ్ కు గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ముర్ము ఒడిషా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. గతంలో ఒడిషాలో బీజేపీ, బిజూ జనతాదళ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ద్రౌపది ముర్ము పేరు కేవలం పరిశీలనలోనే ఉందని ఇంకా ఖరారు కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో హేమాహేమీలే ఉన్నారని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లు చెబుతామని బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం. ద్రౌపది ముర్ముతో పాటుగా స్పీకర్ సుమిత్ర మహాజన్, సుష్మాస్వరాజ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయంటున్నారు. మొత్తం మీద బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఇంకా అభ్యర్థిని నిర్ణయించలేదని ఆచితూచి స్పందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1