రాహుల్ అదే ట్రెండ్ తో….!

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటన ఆ రాష్ట్ర పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం నింపింది. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాహుల్ నాలుగు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ముఖ్యంగా మరోసారి కన్నడ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అంత సానుకూలత లేదు. అంత వ్యతిరేకత లేదు. అయితే బీజేపీని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు కన్నడ కాంగ్రెస్ నేతలు. గుజరాత్ తరహా ప్రచారాన్ని రాహుల్ కంటిన్యూచేస్తున్నారు.

లింగాయత్ లను ఆకట్టుకునేందుకు…..

ముఖ్యంగా కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. వీరంతా బీజేపీకి అనుకూల ఓటు బ్యాంకుగా పేరుంది. అయితే లింగాయత్ లలో ఒకవర్గం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు కూడా దిగారు. అయితే తాజాగా రాహుల్ పర్యటన లింగాయత్ లను ఆకట్టుకునే విధంగా సాగిందనే చెప్పొచ్చు. రాహుల్ లింగాయత్ లకుచెందిన మఠాలను పర్యటించారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా గుళ్లు, గోపురాలను తిరిగి రాహుల్ భారీగానే ఓట్లు సంపాదించారు. ఇప్పుడు రాహుల్ అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నట్లు కన్పిస్తుంది. గుజరాత్ తరహాలలోనే రాహుల్ మఠాలను తిరిగి అక్కడ పూజలు నిర్వహిస్తుండటం లింగాయత్ లను మచ్చిక చేసుకోవడానికేనన్నది కాదనలేని వాస్తవం.

కన్నడ నేతల్లో ఊపునిచ్చిన…..

రాహుల్ నాలుగు రోజులు ప్రత్యేక బస్సులో పర్యటించారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. గుజరాత్ ఎన్నికల్లో వినియోగించిన బస్సునే ఇక్కడకు తీసుకొచ్చారు. రాహుల్ అనేక ఆలయాలను సందర్శించడమే కాకుండా మిరపకాయ బజ్జీలు తిన్నారు. పకోడిలు తింటూ టీ కొట్లో టీ తాగారు. సామాన్యుల్లో ఒకరిగా కలిసిపోయి అందరినీ పలకరించారు. ఇక రైతు నేతలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేధావులతో భేటీ అయి మేధోమధనం జరిపారు. ముఖ్యంగా యువకులతో సమావేశమై వారి అభిప్రాయాలను రాహుల్ అడిగి మరీ తెలుసుకున్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను రాహుల్ ఈ సందర్భంగా ఎండగట్టారు. మొత్తం మీద రాహుల్ నాలుగు రోజుల పర్యటన కన్నడ కాంగ్రెస్ నేతల్లో మంచి ఊపు తెచ్చిందనే చెప్పొచ్చు. రాహుల్ కర్ణాటకలో రెండో దశ పర్యటన ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సాగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1