రా…రా….బంగారం

జనసేనాని మళ్లీ మౌనం వహించారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరిట రెండు రోజుల పాటు హడావిడి చేసిన పవన్ కల్యాణ్ మళ్లీ వారం రోజుల నుంచి కన్పించడం లేదు. పవన్ పై ఒక విమర్శ ఉంది. పార్ట్ టైం పొలీటిషియన్ గా ఆయన్ను ముద్దుగా పిలచుకుంటారు. ఈ కామెంట్స్ ను పవన్ నిజం చేస్తున్నట్లే కన్పిస్తుంది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానన్న పవన్ కల్యాణ్ మళ్లీ పత్తా లేకుండా పోయారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. పవన్ రాజకీయాలను సీరియస్ గా తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నది ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం విశేషం.

కార్యాచరణను రూపొందించే పనిలో….

అయితే పవన్ మాత్రం తాను ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏదో అయిపోదామని అనుకోవడం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. నెమ్మదిగానే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నది ఆయన ఆలోచన. ఇటీవల ఏపీలో మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించి కరువు యాత్ర చేశారు. రైతు సదస్సుల్లో పాల్గొన్నారు. తర్వాత జేఎఫ్ సిని ఏర్పాటు చేసిన పవన్ ఆ హడావిడి ముగిసిన తర్వాత మళ్లీ కలుగులోకి వెళ్లిపోయారన్నది ఆ పార్టీ వర్గాల టాక్. అయితే పవన్ మాత్రం పార్టీ కార్యాచరణను రూపొందించే పనిలో ఉన్నారంటున్నారు ఆయన సన్నిహితులు.

ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని…..

ఇప్పటికే పార్టీ పటిష్టం చేయడానికి సభ్యత్వాలను ప్రారంభించారు. ఇక మార్చి 14వ తేదీన పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఈ ప్లీనరీని నిర్వహించనున్నారు. జనసేన పార్టీ స్థాపించి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ నాలుగేళ్లలో పవన్ క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టలేదన్నది వాస్తవం. సినిమాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన పాలిటిక్స్ కు పెద్దగా సమయం కేటాయించలేకపోయారు. అయితే ఇక సినిమాలు చేయబోనని ప్రకటించిన పవన్ పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

పార్టీ పదవులు, అనుబంధ సంఘాలు….

అయితే జనసైనికులను ఇప్పటికే అన్ని జిల్లాల్లో నియమించారు. ప్రస్తుతం జనసేన పార్టీలో పవన్ తో సహా ఐదుగురు మాత్రమే ఉన్నారు. వారికి కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో పవన్ ఉన్నారు. ప్రత్యేక హోదా పోరాటానికి విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి శతఘ్నిగా నామకరణం చేశారు. అలాగే మహిళ విభాగాన్ని పటిష్టపర్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కార్మిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. పార్టీ పదవులు, అనుబంధ సంఘాల నియామకాలు పూర్తయిన వెంటనే జనసేనాని ప్రజల చెంతకు వస్తారని సమాచారం. అయితే అది ప్లీనరీ సమావేశాలు ముగిసిన తర్వాతనే అని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*