రెంటికీ చెడ్డ రేవడిగా మారిన ఆనం బ్రదర్స్

నెల్లూరు అంటేనే ఆనం బ్రదర్స్. దశాబ్దాల కాలం పాటి నెల్లూరు జిల్లాను ఏలిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమితుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యారట. టీడీపీలో చేరి తాము వంచనకు గురయ్యామంటూ ఆనం బ్రదర్స్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆనం సోదరుల్లో ఒకరైన వివేకానంద రెడ్డి నెల్లూరులోనే ఉండటం మానేశారు. తనకు విలువ లేని చోట ఉండలేనని ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆనం వివేకా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. మరోవైపు ఆనం రామ్ నారాయణ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబును చివరి సారి కలిసి తమ పరిస్థితి పార్టీలో ఏంటో తెలుసుకుందామని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం రామనారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి దొరికితే తమ ఎమ్మెల్సీ పదవి గురించి చివరిసారి కనుక్కుందామని వెయిట్ చేస్తున్నారు.

తిట్ల దండకం అందుకున్న ఆనం వివేకా……

ఆనం సోదరుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించినా ఇప్పుడు అది సాధ్యం కాదని తేలిపోయింది. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు టీడీపీ అధినేత చంద్రబాబు మాట ఇచ్చేశారు. దీంతో ఆనం బ్రదర్స్ కు ఇక ఎమ్మెల్సీ పదవి లేనట్లేనన్నది తేలిపోయంది. మరోవైపు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆనం బద్రర్స్ ను దూరం పెడుతున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనం సోదరుల ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. అదే చివరిసారి. తర్వాత పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఈ బ్రదర్స్ ను పార్టీ నేతలు దూరంగా ఉంచుతున్నారు. పదేళ్ల పాటు తమను ముప్పుతిప్పలు పెట్టిన ఆనం సోదరులపై నెల్లూరు జిల్లా నేతలు ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారన్న టాక్ కూడా సింహపురిలో బలంగా విన్పిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి తొలి నుంచి కొంచెం టెంపర్ ఉన్న వ్యక్తి. ఉన్నదున్నట్లు మాట్లాడేస్తారు. ఎమ్మెల్సీ పదవి రాదని తేలడంతో ఆనం వివేకా తన సన్నిహితుల వద్ద టీడీపీని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నట్లు సమాచారం. తాము టీడీపీలో చేరి తప్పు చేశామని, రాజకీయంగా పెద్ద పొరపాటు చేశామని ఆనం వివేకా టీడీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరో వైపు మెతక స్వభావం కలిగిన ఆనం రామనారాయణరెడ్డి మాత్రం చివరిసారి చంద్రబాబును కలిసి తమకు ఇచ్చిన హామీ ఏమైందో ఒకసారి కనుక్కుని అప్పుడు నిర్ణయించుకుందామనుకుంటున్నారు. మొత్తం మీద ఆనం బద్రర్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ దొరికి…ఆయనతో మాట్లాడిన తర్వాత వీరు రాజకీయంగా ఒక క్లారిటీకి వచ్చే అవకాశముంది. అయితే వీరు వైసీపీలో చేరలేక, టీడీపీలో ఉన్నా పదవులు రాక రెంటికీ చెడ్డ రేవడిగా పరిస్థితి మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1