రేవంత్ ఆప‌రేష‌న్‌…. వాళ్ల‌కు టెన్ష‌న్ టెన్ష‌న్‌…!

కాస్త కాదు చాలా ఆల‌స్యంగా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యాడు రేవంత్‌. వైఎస్ హ‌యాంలోనే ఆయ‌న‌కు పిలుపువ‌చ్చినా చంద్ర‌బాబు న‌మ్మిన బంటుగా టీడీపీలో ఉండిపోయాడు. ఓటుకు నోటు కేసు త‌రువాత రేవంత్ మ‌రింత స‌మ‌స్య‌ల్లోకి జారుకున్నాడు. ఎర్ర‌బెల్లిలాంటి లీడ‌ర్లు ఎవ‌రి దారి వారు చూసుకోవ‌డంతో ఇక ఒక్క‌డే ఉండి టీడీపీని శాసించేది ఏమీ లేదు క‌నుక కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయాడు. కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ఇప్ప‌టికీ ప‌లు మార్లు త‌న వాద‌న వినిపిస్తూ వ‌చ్చాడు. కాంగ్రెస్‌లోనూ కీల‌కంగా ప‌నిచేస్తూ అక్క‌డి నాయ‌కుల‌కూ హాట్ టాపిక్ గా మారాడు. స‌బ్జెక్ట్ ఏదైనా త‌న‌దైన శైలిలో మాట్లాడగ‌ల నేర్ప‌రి రేవంత్. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌లోనూ త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని బిల్డ‌ప్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే త‌న‌దైన ఆక‌ర్ష‌ణ మంత్రాన్ని ఉప‌యోగిస్తున్నాడు.

మరికొందరిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు….

ఈ కోవ‌లోనే త‌న దారి న‌మ్మిన వారిని ఇటుగా తీసుకువ‌స్తున్నాడు. తాజాగా ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ మాలోతు రాందాస్‌నాయక్ ని కాంగ్రెస్ లో చేర్పించ‌నున్నారు.త‌న మాట‌ని జ‌వ‌దాట‌ని నేత‌ల‌నే హ‌స్తం గూటికి చేర్పించే ప్ర‌య‌త్నం ఒక‌టి ఈయ‌న‌చేరిక‌తో ఆరంభించనున్నాడు రేవంత్‌. ఇదే జిల్లాకు చెందిన పోట్ల నాగేశ్వరరావుతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. అనంత‌రం సీనియ‌ర్ నేత రేణుకా చౌదరి ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవనున్నారు. వాస్త‌వానికి రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన నాటినుంచే రాందాస్‌నాయక్ పార్టీ మారే ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. 2009, 2014ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన‌ప్ప‌టికీ తిరుగుబావుటా ఎగుర‌వేయ‌క రేవంత్ ఉన్నాడ‌న్న ఒక్క కార‌ణంతోనే పార్టీలో కొన‌సాగారు.

సీనియర్ నేతలకు టెన్షన్…..

కానీ ఉన్న‌ట్టుండి గురువారం రేవంత్‌రెడ్డి నుంచి పిలుపురావటంతో రాందాస్‌నాయక్‌ హుటాహుటిన హైదరాబాద్ బ‌య‌లుదేరి వెళ్లారు. ఇక టీడీపీ శ్రేణుల నుంచి ఇంకెంత‌మంది కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారో అన్న‌ది ఇప్పుడిక కీలకం. రాహుల్ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్న స‌మయానికి పార్టీని ప‌టిష్టం చేయాల‌న్న ఆలోచ‌న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి యోచిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ కూడా త‌న‌కి తాను ఎదిగేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలూ ముమ్మ‌ర‌మ‌య్యాయి. కాంగ్రెస్‌లో ఏళ్లకు ఏళ్లు ఉన్న వృద్ధ క‌పోతాల న‌డుమ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ని నిర్దేశించుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు. అవి స‌ఫ‌లీకృతం అవుతాయో లేవో అన్న‌ది ఇప్పుడిక కీల‌కం.మ‌రోవైపు టీఆర్ఎస్‌పై మాట‌ల దాడిని పెంచుతున్నాడు రేవంత్‌. ముఖ్య నాయ‌కుల క‌న్నా వేగంగా ఆయ‌న త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నాడు. రేవంత్ దూకుడు, ఈ కొత్త ఆప‌రేష‌న్ టీ కాంగ్రెస్ నాయ‌కుల్లో ఇప్పుడు గుబులు రేపుతోంది.