రేవంత్ కు అడుగడుగునా అడ్డంకులేనా?

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గాంధీభవన్ లోకి ఎందుకు అడుగుపెట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు. ఆయన అధికారికంగా రాహుల్ సమక్షంలో పార్టీలో చేరినప్పటికీ ఇప్పటి వరకూ గాంధీ భవన్ కు రాకపోవడానికి కారణాలేంటి? రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం తెలంగాణలో రాహుల్ గాంధీ సభ జరిగిన తర్వాత అధికారికంగా పార్టీలో చేరినట్లవుతుందని, అప్పటి నుంచే కాంగ్రెస్ లో క్రియాశీల పాత్ర పోషించాలనకున్నారు. కాని రాహుల్ సభ రోజురోజుకూ వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఈ నెల 19వ తేదీ రాహుల్ సభ ఉంటుందని పీసీసీ నేతలు ప్రకటించారు. అయితే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ముమ్మరంగా పాల్గొంటున్నందున ఆ సభ వాయిదా పడిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇంకా రాహుల్ అపాయింట్ మెంట్ దొరకడం లేదని, ఆయన సూచన మేరకు సభ ఎప్పుడు నిర్వహించాల్సింది చెబుతామంటున్నారు పీసీసీ నేతలు.

గాంధీభవన్ లో అడుగెందుకు పెట్టలేదు…?

అయితే రేవంత్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆ పార్టీకి హైప్ వచ్చింది. అప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ స్తబ్దుగా ఉంది. ఏ నేత కాంగ్రెస్ లో చేరేందుకు సాహసించలేదు. కాని రేవంత్ చేరిక తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి చేరికలు మొదలయ్యాయి. దీంతో రేవంత్ కు అధిష్టానం వద్ద కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతోనే రాహుల్ సభను కావాలని వాయిదా వేస్తున్నారని అంటున్నారు. మరోవైపు రేవంత్ సొంతంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సొంత నిర్ణయాలు ఉండవని పీసీసీ నేతలే చెబుతున్నారు. పార్టీ అధిష్టానం అనుమతి తీసుకున్న తర్వాతే పాదయాత్ర చేయాలని కొందరు రేవంత్ కు నేరుగా చెప్పారు. పార్టీలో పదవి లేకుండా పాదయాత్ర చేయలేని పరిస్థితి రేవంత్ ది. దీంతో తన పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు త్వరలోనే రేవంత్ ఢిల్లీ బాట పట్టనున్నట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లి తన పాదయాత్రపై అనుమతి తెచ్చుకోవడం, తనకు పదవి విషయంపై క్లారిటీ తీసుకోవడం రేవంత్ ముందున్న కర్తవ్యాలు. మరి హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*