రేవంత్ దూకుడు కు టిఆర్ఎస్ నయా ప్లాన్ …?

తెలంగాణ కాంగ్రెస్ నేత దూకుడు కు కళ్లెం వేసేందుకు పాత అస్త్రాన్ని బయటకు తీసేందుకు టిఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందా ? అవుననే అనిపిస్తున్నాయి తాజా పరిణామాలు. టి సీఎం కేసీఆర్ పై రేవంత్ నేరుగా చేస్తున్న దాడి గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒక వైపు ఆరోపణలు, విమర్శలు చేస్తూనే న్యాయస్థానాల్లో పలు కేసులను వేస్తూ రేవంత్ టి సైన్యాన్ని కలవర పరుస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు పైనా, లాభదాయక పదవులు పొందిన వారిపై అనర్హత వేటు వేయాలని ఇలా అనేక కేసులను టి సర్కార్ పై అస్త్రాలుగా సంధించి అన్ని వైపులా దాడి తీవ్రం చేస్తున్నారు రేవంత్. ఇక కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పాలనపై నిత్యం విరుచుకుపడుతూ ప్రజాక్షేత్రం లో సవాళ్లు విసురుతున్నారు. రేవంత్ ధాటికి తట్టుకోలేక ప్రభుత్వం అభ్యంతర కర భాషపై కోర్టుతో సంబంధం లేకుండా నేరుగా అరెస్ట్ చేసే ఒక జీవో ను సైతం కేసీఆర్ తెచ్చేశారు. అవసరాన్ని బట్టి అది బయటకు తీసే అవకాశం స్పష్టం అవుతుంది.

పాత కేసు బయటకు తీసే ఛాన్స్…?

ఇలా తన నోటితో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతున్న రేవంత్ ని కట్టడి చేయాలంటే ఓటుకు నోటు కేసు మాత్రమే తమను కాపాడుతుందని టి సర్కార్ ఒక అభిప్రాయానికి వచ్చిందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. అందులో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారు ఇప్పటికే ఆ తరహా దాడి మొదలు పెట్టేశారు కూడా. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడుగా వున్న రేవంత్ కి తమ బాస్ కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదని ఎదురుదాడి ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లోగా నిద్రాణంగా వున్న ఓటుకు నోటు కేసును బయటకు తీయక తప్పని పరిస్థితి టిఆర్ ఎస్ కు ఏర్పడుతుంది. అయితే ఇక్కడే టి సర్కార్ కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది. పొరుగు రాష్ట్ర సీఎం భాగస్వామ్యం వున్న ఈ కేసు సుప్త చేతన అవస్థలో ఉంచడానికి పెద్దల మధ్య ఇద్దరు చంద్రుల రాజీ జరిగిందన్నది పొలిటికల్ టాక్. ఈ నేపథ్యంలో రేవంత్ కోసం ఈ కేసు వేగవంతం చేస్తే చంద్రబాబు అనూహ్యంగా ఇరుకున పడటం ప్రచారం లోకి రావడం జరిగిపోతాయి. దానివల్లే ఇప్పటివరకు బ్రేక్ లు వేస్తూ వస్తున్న టి సర్కార్ రేవంత్ దూకుడు ఇలాగే కొనసాగితే తప్పని పరిస్థితిలో మళ్ళీ పాత కేసులో అల్లరి చేసేందుకు సిద్ధం కావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*