రేవంత్ బౌన్సర్లు అందుకేనా?

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అవ్వడానికి కారణమేంటి? ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి మళ్లీ ఫాం లోకి రావడానికి రహస్య సమావేశమేనా? అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో రేవంత్ ఇటీవల రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత నుంచే రేవంత్ వైఖరి మారిందంటున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక తొలుత యాక్టివ్ గానే కన్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ రేవంత్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఇమేజ్ ను పెంచుకున్నారు.

హామీలు అమలు చేయకపోవడంతో…..

అయితే రేవంత్ పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్న అసంతృప్తి ఉంది. తనకు పార్టీలో గౌరవమైన పదవి ఇస్తానని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినా ఇంతవరకూ అమలు కాకపోవడానికి ఉత్తమ్ కారణమని రేవంత్ బలంగా నమ్మారు. దీంతో పాటు రేవంత్ చేసిన కామెంట్లపై కూడా సీనియర్లు సీరియస్ అయ్యారు. మీడియా చిట్ ఛాట్ లో రేవంత్ తాను కూడీ సీఎం రేసులో ఉన్నట్లు చెప్పడంతో సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రేవంత్ కు తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తామన్నారు. తర్వాత ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగిస్తామన్నారు. ఇంతవరకూ ఏ పదవి దక్కకపోవడంతో రేవంత్ ఒకింత అసంతృప్తితో ఉన్నారు.

ఉత్తమ్ కారణమని……

తనకు పదవి దక్కకపోవడానికి ఉత్తమ్ కారణమని భావించిన రేవంత్ రెడ్డి ఉత్తమ్ వ్యతిరేకవర్గంతో కలసి ఢిల్లీ వెళ్లడం అప్పట్లో సంచలనం కల్గించింది. ఉత్తమ్ వ్యతిరేక వర్గం వేళ్లూనుకుంటుండటంతో ఆయన కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రేవంత్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు సమాచారం. పదవి రాకపోవడానికి తాను కారణం కాదని, త్వరలోనే ప్రకటన వస్తుందని కూడా ఉత్తమ్ రేవంత్ కు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అంతేకాదు రేవంత్ వెంట పార్టీలో చేరిన వారికి టిక్కెట్ల విషయంలో తన జోక్యం ఉండదని కూడా ఉత్తమ్ భరోసా ఇవ్వడంతో ఇద్దరి నేతల మధ్య రాజీ కుదిరిందని చెబుతున్నారు.

ఇద్దరి మధ్య సయోధ్య……

అందుకే మళ్లీ రేవంత్ యాక్టివ్ అయి టీఆర్ఎస్ నేతలపై బౌన్సర్లు వేస్తున్నారంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ఎంత అవసరమో….రేవంత్ కు కూడా ఆ పార్టీ అంతే అవసరం. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీచులాటలతో పార్టీ పరువును బజారు పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుందని, మరో ఐదేళ్లు అధికారం కోసం ఆగాల్సి వస్తుందని రేవంత్ కు తెలియంది కాదు. అందుకే ఉత్తమ్ చెప్పిన మాటలకు రేవంత్ మెత్త బడినట్లు చెబుతున్నారు. కాని తన పదవి విషయంలోనూ, తనతో పాటు చేరిన వారి సీట్ల ఖరారు విషయంలోనూ ఢిల్లీకి వెళ్లి మరీ తేల్చుకుంటానని రేవంత్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. మొత్తం మీద రేవంత్ మౌనం వీడి మళ్లీ ఫాం లోకి రావడంతో కొంత గాంధీ భవన్ కళకళలాడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*