లాజిక్ లేకుండా సాగదీస్తే ఎలా?

ఓ రాష్ట్రానికి సీఎం అయినంత మాత్రాన దేశ రాజ్యాంగాన్ని విస్మ‌రించాలని ఎక్క‌డా లేదు. అయితే, ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం తాను మేధావినని, న‌ల‌భై ఏళ్ల పొలిటిక‌ల్‌ ఇండ‌స్ట్రీలో తానే పెద్ద‌న‌ని ప‌దే ప‌దే చెప్పుకొంటారు. అయితే, ఆయ‌న‌పై మేధావులు ఇప్పుడు విరుచుకుప‌డుతున్నారు. దీనికి కార‌ణంగా ఇటీవ‌ల కొంత కాలంగా బాబు చేస్తున్న వ్యాఖ్య‌లే కారణంగా క‌నిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బాబు వ్యాఖ్య‌లు శృతి మించుతున్నాయి.

తొలుత ప్యాకేజీ అని….

మొద‌ట్లో హోదాను ఆయ‌న సంజీవినితో పోల్చారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కే ఆయ‌న హోదా ఏమ‌న్నా సంజీవ‌నా? అంటూ రివ‌ర్స్ వ్యాఖ్య‌లు చేశారు. ఇవ‌న్నీ జ‌నాలు విన్నారు. అయితే, ప్యాకేజీ ముద్ద‌న్న బాబు.. ప్ర‌జ‌ల్లో హోదా సెంటిమెంట్ ర‌గులుతున్న విష‌యాన్ని గుర్తించి ఇప్పుడు మ‌ళ్లీ హోదానే ముద్దు.. ప్యాకేజీ ఇచ్చినా హోదా ఇచ్చితీరాలి అంటున్నారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ఓ విచిత్ర‌మైన వ్యాఖ్యానాన్ని తెర‌మీదికి తెచ్చారు. ఈశాన్య రాష్ట్రాల‌కు హోదా ఇస్తున్న‌ప్పు డు ఏపీకి ఎందుకు ఇవ్వ‌రు అని! అంతేకాకుండా.. ఏపీకి హోదా ఇవ్వ‌ని ప‌క్షంలో ఈశాన్య రాష్ట్రాల‌కు కూడా నిలిపి వేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కు….

నిజానికి ఈశాన్య రాష్ట్రాల‌కు హోదా అనేది కేంద్రం ఏమీ ఉదారంగానో.. ఇష్ట పూర్వ‌కంగానో ఇవ్వ‌డం లేదు. ఇది రాజ్యాంగం ఆయా రాష్ట్రాల‌కు క‌ల్పించిన వెసులు బాటు అనే చిన్న విష‌యం కూడా చంద్ర‌బాబుకు తెలియ‌దా? అని మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు. లేక తెలిసి కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌దు, వారికి రాజ్యాంగంపై అవ‌గాహ‌న ఉండ‌దు కాబ‌ట్టి ఏదో ఒక విధంగా త‌న‌ను తాను బ‌లోపేతం చేసుకునేందుకు ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నారా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

అందుకే అక్కడ ప్రత్యేకం….

ఈశాన్యం రాష్ట్రాలు అన‌గానే.. ఆయా ప్రాంతాలు.. కొండలు, గుట్ట‌ల మ‌ధ్య అస‌మ‌తుల్య‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల మ‌ధ్య ఏర్ప‌డిన ప్రాంతాల‌ని అర్ధం. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల జీవ‌న శైలి కూడా అదేవిధంగా ఉంటుంది. ఏడాదిలో ప్ర‌తి నెలా వారికి ఒకేలా ఉండ‌దు. ఒక్క మాట‌లో చెప్పాలంటే మైదాన ప్రాంత‌ రాష్ట్రాల‌కు, ఈశాన్య రాష్ట్రాల‌కు అనేక విధాలైన తేడా ఉంటుంది. వ్య‌వ‌సాయానికి కూడా ఈ రాష్ట్రాలు ఏమంత అనుకూలంగా ఉండ‌వు. దీంతో అన్ని విష‌యాల‌నూ గ‌మ‌నించిన రాజ్యాంగ స‌భ్యులు ఈశాన్య రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక సౌక‌ర్యాలతోపాటు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అన్ని విధాలా అందాల్సిన సాయాన్ని స్ప‌ష్టంగా రాజ్యాంగంలో పేర్కొన్నారు.

ఆ విషయాలు తెలిసి కూడా…

ఈ క్ర‌మంలోనే అస్సాం, మిజోరం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, త్రిపుర‌, మ‌ణిపూర్, సిక్కిం వంటి రాష్ట్రాల‌కు రాజ్యాంగంలో ప్ర‌త్యేకంగా ఆర్టిక‌ల్స్‌.. 371, 371A నుంచి 371H, and 371Jల‌ను ఏర్పాటు చేశారు. వీటి ప్ర‌కారం కేంద్రంలో ఏ ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టికీ.. ఇష్టం ఉన్నా లేకున్నా ఆయా రాష్ట్రాల‌కు సాయం అందించాల్సిందే. మ‌రి ఈవిష‌యాల‌ను తెలిసి కూడా చంద్ర‌బాబు ఈశాన్య రాష్ట్రాల‌కు ఎందుకు ఇస్తున్నారు? అని ప్ర‌శ్నిస్తున్నారంటే.. రాజ‌కీయ వ్యాఖ్య‌లు కాక ఆయ‌న చేస్తున్న వాద‌న‌లో ప‌స ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు మేధావులు. ఇక ఇటీవల బాబు రాజ‌కీయ ల‌బ్ధి కోసం లాజిక్ లేకుండా మాట్లాడేస్తున్నారు. అప్పుడే ఏపీకి ప్ర‌త్యేక హోదా వద్దు..అదేమ‌న్నా సంజీవ‌నా అంటారు. అప్పుడే హోదా కావాలంటారు. దీంతో చంద్ర‌బాబు ఇటు ఏపీ జ‌నాల్లో చుల‌క‌న కావ‌డంతో పాటు అటు కేంద్రం కూడా లైట్ తీసుకునే ప‌రిస్థితి త‌నంత‌ట తానే క‌ల్పించుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*