వచ్చే ఏడాది ఏపీ ప్రజలకు పవర్ ఫుల్ గుడ్ న్యూస్

రెండో దశ విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ వ్యయం తగ్గిస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గించే పరిస్థితులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన నాలుగు భారీ సోలార్ విద్యుత్ పార్కుల్లో అనంతపురములోని 250 మెగావాట్ల ప్లాంట్ పూర్తి కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత విద్యుత్ వినియోగంలో 20శాతం వ్యవసాయ రంగంలోనే ఉందని, విద్యుత్ రంగంలో ఘన విజయాలు సాధిస్తూ వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ స్థితికి చేరుకున్నామని అన్నారు. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి మౌలిక వసతులపై తన నివాసంలో సమీక్ష జరిపారు. సౌర విద్యుత్ ద్వారా వచ్చే ఏడాదికి విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గించి వినియోగదారులపై చార్జీల భారం తగ్గించే అంశంపై అధ్యయనం చేసి ఒక వారంలో తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి తీరాలని ముఖ్యమంత్రి కోరారు. పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలను సమన్వయం చేసి ఏపీ ఫైబర్ ద్వారా రియల్ టైమ్‌లో నీరు, విద్యుత్ బిల్లులు అందించేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలని చెప్పారు. మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సాంకేతిక ఆవిష్కరణకు పేటెంట్ రిజిస్ట్రేషన్ జరగాలని సూచించారు. అనంతపురములో ఎనర్జీ యూనివర్శిటీని రూ.400 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, కాకినాడలో లాజిస్టిక్ యూనివర్శిటీని రూ.350 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, స్థానిక వర్శిటీలతో మాట్లాడుకుని తాత్కాలిక క్యాంపస్‌లతో ఈ విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించారు. 2018 చివరి నాటికి సొంత భవనాలు నిర్మించుకుని మారవచ్చునన్నారు. ఎనర్జీ యూనివర్శిటీకి నెడ్‌క్యాప్‌ యాంకర్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకరరావు చెప్పారు. సలహాదారుగా ప్రొఫెసర్ మంథాను నియమిస్త్తున్నట్టు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1