వీరి భేటీ జగన్ కు కలిసి వచ్చిందా?

వైసీపీ అధినేత జగన్ కు కొన్ని కలిసి వస్తున్నాయి. ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ తర్వాత పోలవరం ఈ ఏడాది పూర్తి కాదని చంద్రబాబు దాదాపు చెప్పేశారు. మూడు నెలల సమయం వృధా అయిందని, ఇప్పటి నుంచి పనులు వేగవంతం చేస్తేనే పోలవరం వచ్చే ఏడాదికి సాధ్యమవుతుందని చంద్రబాబు బయటకు అనేశారు. మోడీతో భేటీ తర్వాత చంద్రబాబు హుషారుగా కన్పించినా పోలవరం విషయంలో మాత్రం కొంత గందరగోళంలో పడినట్లే కన్పించింది. మోడీతో సమావేశం అయిన తర్వాత కూడా పోలవరం పూర్తి కాకపోవచ్చని ఆయన నోటి వెంట వచ్చిందంటే స్పష్టమైన హామీ మోడీ నుంచి రాకపోయి ఉండవచ్చన్నది వైసీపీ నేతల అంచనా. అంతేకాదు గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు చేసిన మూడు వేల కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చే విషయంలో కూడా క్లారిటీ వచ్చినట్లు లేదు.

ఈ ఏడాది చివరికే….

పోలవరం ప్రాజెక్టు నుంచి 2018 చివరి నాటికి నీరు ఇస్తామని గత కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. అందుకు వైసీపీయే అడ్డుకుంటుందని, కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తుందని చెబుతూ వస్తున్నారు. వైసీపీ వల్లనే ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని ఇప్పటి వరకూ ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఇక నుంచి ఈ ఆరోపణలను ప్రజలను నమ్మే అవకాశం లేదు. ఇప్పటి వరకూ ప్రధాని మోడీతో అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో మోడీ కూడా జగన్ ను దగ్గరకు తీసుకుంటున్నారని, చంద్రబాబును దూరం పెడుతున్నారని ఏపీ ప్రజలు కూడా భావించారు.

వైసీపీ అడ్డంకి అంటూ…

కాని తాజా భేటీతో ఆ అనుమానాలు నిజం కావని స్పష్టమయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో సాంకేతికంగా జరుగుతున్న అవకతవకలు, కాఫర్ డ్యాం వంటి అంశాలు, కేంద్రం ఇచ్చిన నిధులకు సక్రమంగా లెక్కలు చూపకపోవడం వల్లనే కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్నది అర్థమయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లెక్కలు సక్రమంగా చెబితే నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని బీజేపీ నేత పురంద్రీశ్వరి కూడా ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు వైసీపీ పై చేస్తున్న విమర్శలు అర్థరహితమని తేలిపోయిందంటున్నారు.

ప్రజల్లోకి బలంగా…

దీంతో ఇక వైసీపీ పోలవరం ప్రాజెక్టుపై ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమవుతోంది. శ్వేతపత్రం విడుదల చేయమంటే వెబ్ సైట్ లో చూసుకోమంటారని, తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి పోలవరం పూర్తి కాకపోవచ్చని మాట మారుస్తున్నారని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మోడీతో భేటీలో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా కేవలం నియోజకవర్గాల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావించిన విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఏడాది తర్వాత మోడీని చంద్రబాబు కలిసినా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చన్నది వైసీపీ సీనియర్ నేతల అభిప్రాయం. ఇన్నాళ్లూ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి అని చెబుతున్న చంద్రబాబు మోడీని కలిసి వచ్చిన తర్వాత ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద మోడీ, చంద్రబాబు భేటీ తమకు కలిసి వచ్చిందంటున్నారు వైసీపీ నేతలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*