వెంకయ్యనాయుడిని సైడ్ చేయడానికి మోడీ ప్లాన్?

అంతా వూహించినట్టే జరుగుతోంది. వెంకయ్యకు చెక్‌ పెడతారని జరిగిన ప్రచారానికి తగినట్లే ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు పేరు తెరపైకి వచ్చింది. నిజానికి వెంకయ్య రాజ్యసభ సభ్యత్వం ముగిసిన సమయంలోనే ఆయన్ని ఈశాన్య రాష్ట్రాలకు కాని., జమ్మూ కశ్మీర్‌కు కాని గవర్నర్‌గా పంపుతారని ప్రచారం జరిగింది. అయితే వెంకయ్య ఏ మంత్రాంగం నడిపారో కాని ఆయన మంత్రి పదవి ఊడలేదు. పైపెచ్చు అదనపు మంత్రి బాధ్యతలు లభించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఉండగానే., సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కూడా వరించింది. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో తాజాగా రాష్ట్రపతి అభ్యర్ధిని ఎంపిక చేసే కమిటీకి కూడా వెంకయ్యను సభ్యుడిగా చేశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమైన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా వెంకయ్యను ఎంపిక చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఇది వెంకయ్యకు శరాఘాతమే. నిజానికి వెంకయ్య వ్యవహారశైలిపై ప్రధాని మోదీకి లోలోన అసంతృప్తి ఉన్నా ఎక్కడ బయటపడలేదు. ఏపీలో బీజేపీ బలపడకపోవడానికి వెంకయ్య-బాబుల జోడీయే కారణమని అసమ్మతి వర్గాలు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తూ వచ్చాయి.

కొంతకాలంగా కోపంగా సీనియర్లు…

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు వ్యవహార శైలికి వెంకయ్య మద్దతిస్తున్నారని., అది రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయకుండా అడ్డుకుంటోందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా రాష్ట్రపతి ఎన్నికలు జరిగే సమయంలో వెంకయ్య పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత వెంకయ్య పేరును ఖరారు చేయనున్నారు. అయితే వెంకయ్య మాత్రం క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తున్నారు. అయితే బీజేపీ సీనియర్లలో మాత్రం వెంకయ్యపై బాగా గుర్రుగా ఉన్నారు. ముఖ్యమంత్రులు సైతం దక్కని ప్రయోజనాలు వెంకయ్య ఇప్పటికే అందిపుచ్చుకున్నారని., అదే సమయంలో వెంకయ్య ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు రాణించలేదని కూడా గుర్తు చేస్తారు. కేవలం వాక్చాతుర్యంతో నెట్టుకొస్తున్న వెంకయ్య పెద్దల సభను నడిపించే బాధ్యత అప్పగిస్తే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని మోదీ భావిస్తున్నారు. అయితే ఎవరికి ఎప్పుడు చెక్‌ పెట్టాలో తెలిసిన మోదీకి వెంకయ్య హవాకు భలే అడ్డుకట్ట వేశారని ప్రత్యర్ధులు తెగ సంబరపడిపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1