వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళితే…బాబుకు కష్టాలేనా?

వెంకయ్య నాయుడు……తెలుగు-ఇంగ్లీష్‌-హిందీ భాషల్ని మిక్స్‌ చేసి జనాల్సి మెస్మరైజ్‌ చేసే ఉపన్యాసాలివ్వడంతో తనకు తానే సాటి అనిపించుకునే వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఖరారు చేస్తే లాభనష్టాలేమిటి….. వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పదోన్నతి కల్పిస్తారనే వార్తల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు., ముఖ్యంగా ఏపీకి , దానికంటే ఎక్కువగా చంద్రబాబుకు నష్టం కలుగుతుందనే భావన కొందరిలో ఉంది. నిజానికి వెంకయ్యనాయుడు ఏపీకి కొత్త ప్రాజెక్టులు రావడానికి సహకరించారో లేదో తెలియదు కాని విస్త్రత ప్రచారం మాత్రం దక్కింది. రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు విద్యా సంస్థల ఏర్పాటు తన కృషితోనే జరిగిందని చాలా సందర్భాలలో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత మేలు మోదీ పాలనలో ఏపీకి దక్కిందని కూడా వెంకయ్య చెప్పుకున్నారు. అయితే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ వచ్చినా అది కూడా మంచిదేనని సెలవిచ్చేవారు.

ప్రాజెక్టులు ఆయన చలవేనా…..?

ఇటీవల ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల విషయంలో వెంకయ్య కృషి వల్లే ఉత్తర్వులు వెలువడ్డాయని చెబుతారు. ఇక ఏపీ విడిపోయిన తర్వాత ప్రాజెక్టులు సాధించడంలో., రాష్ట్రాన్ని ఆదుకోవడంలో వెంకయ్య క్రియాశీల పాత్ర పోషించారని., విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా, రాజధానికి భూములిచ్చిన రైతులకు రాయితీలు., కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు…. ఇలా అన్ని అంశాల్లో అవసరమైన మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనపైనే ఆధారపడేది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల్ని అయా శాఖల వద్దకు తీసుకువెళ్లడానికి అవసరమైతే వారిని తన వద్దకే పిలిపించడానికి వెంకయ్య పనికొచ్చేవారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతి చేస్తే ఇక రాజ్యసభ అధ్యక్ష స్థానానికే పరిమితం కావాల్సి వస్తుంది. ఆయన మాట మునపటిలా చెల్లుబాటయ్యే అవకాశం ఉండదు. ప్రత్యేక హోదా స్థానంలో వచ్చిన ప్యాకేజీకి ఎక్సటర్నీ ఎయిడెడ్‌ ప్రాజెక్టులు అమోదం పొందాలంటే సంబంధిత మంత్రిత్వ శాఖల అమోదం పొందితేనే రుణాలిచ్చే ఏజెన్సీలకు చేరతాయి. ఇప్పుడిక ఆ ద్వారాలు మూసుకుపోతాయి. ఇటీవల మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సొంతంగా రుణ అమోదం పొందిన కేంద్రం మోకాలడ్డింది. ఇక వెంకయ్యలాంటి నాయకులు లేకుంటే ఏపీకి మొండి చేయేనని రాష్ట్ర మంత్రులు సైతం చెబుతున్నారు. వెంకయ్యను క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగించాలని మంత్రులు గంటా., ప్రత్తిపాటి పుల్లారావులు అభిప్రాయపడ్డారు. మరోవైపు వెంకయ్య అభ్యర్ధిత్వంపై చంద్రబాబు నాయుడు సైతం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఇద్దరు నాయుళ్లు ఒకరికొకరు అండగా ఉంటూ వచ్చారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపితే బాబు తరపున ఢిల్లీలో వకాల్తా పుచ్చుకునే గొంతు కరువవుతుంది. మోదీ మనసులో ఏముందో ఎవరికి అర్ధం కాని సమయంలో అనూహ్యంగా ముంచుకొచ్చిన ఉపద్రవంగానే టీడీపీ అధినేత కూడా భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1