టిడిపి – బిజెపి వార్

ఆ జిల్లాలో ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే. ఆయన మంత్రి అయ్యాడు. చుక్కలు చూపిస్తున్నాడు టీడీపీకి. తెలుగు తమ్ముళ్లకు కంట్లో నలుసుగా మారాడు. ఎంత మంది ఉన్నారన్నది కాదు…ఎవరు ఉన్నారన్నదే ముఖ్యం అన్నట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి మాణిక్యాలరావు టీడీపీ నేతలకు సవాలుగా మారారు. ఏమాత్రం తగ్గకుండా సై అంటై సై అంటున్నారు మంత్రి మాణిక్యాలరావు. కాషాయం పవర్ ఏంటో చూపిస్తానంటున్నాడు మిస్టర్ మినిస్టర్. వెస్ట్ లో టీడీపీ బీజేపీల మధ్య వార్ మొదలయింది. మంత్రి మాణిక్యాలరావుకు, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మధ్య నిన్నటి వరకూ మాటల యుద్దం మాత్రమే నడిచింది. ఇప్పుడు ఏకంగా రెండు వర్గాలూ బాహాబాహీకి సిద్ధమవుతున్నాయి.

టిడిపి – బిజెపి  వార్మేకల సంత వివాదం….

తాడేపల్లి గూడంలో మేకల సంత ప్రసిద్ధి. ఎన్నో ఏళ్ల నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద తాడేపల్లిలో ఈ మేకల సంత జరుగుతుంది. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ప్రతి శనివారం ఈ సంతకు మేకలు, గొర్రెల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. లక్షల్లో వ్యాపారం జరుగుతుంటుంది. ఇక్కడ ఒక మేకను అమ్మాలంటే పది రూపాయలు కమిటీకి చెల్లించాలి. ఈ సొమ్ము మార్కెట్ మేనేజ్ మెంట్ కు వెళుతుంది. ఈ మార్కెట్ కమిటీకి మంత్రి మాణిక్యాల రావు అనుచరుడు పోతుల అన్నవరం చూస్తుంటారు. దీనిపై కన్నేసింది టీడీపీ. మేకల సంతలోకి ఎంట్రీ ఇచ్చింది. జడ్పీ ఛైర్మన్ బాపిరాజు అనుచరుడు ఆళ్లపాటి వెంకటేశ్వరరావు తన బ్యాచ్ తో వచ్చి అమ్మకాలపై వచ్చే సొమ్ము పెదతాడేపల్లి గ్రామ పంచాయతీకే దక్కాలని మెలిక పెట్టారు. ఆందోళన కూడా చేశారు. మేకల అమ్మకాన్ని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి రెండు వర్గాలను శాంతింప చేశారు. గత కొంతకాలంగా ముళ్లపూడి బాపిరాజుకు, మంత్రి మాణిక్యాలరావుకు పొసగడం లేదు. తెలుగుదేశం పార్టీ వల్లనే మాణిక్యాలరావు గెలిచాడని బాపిరాజు బహిరంగంగా వ్యాఖ్యానించడంతో మాణిక్యాలరావు కూడా పంచ్ లు ఇవ్వడం బిగిన్ చేశారు. బీజేపీ వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాకు నిట్ మంజూరైనప్పుడు కూడా రెండు వర్గాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఏలూరులో నిట్ ఏర్పాటు చేయాలని బాపిరాజు వర్గం తెగ ప్రయత్నించింది. చంద్రబాబుకూడా దీనికి మద్దతు తెలిపారు. అయితే మాణిక్యాలరావు నేరుగా కేంద్రంతో మాట్లాడుకుని నిట్ ను తన నియోజకవర్గమైన తాడేపల్లి గూడేనికి తీసుకొచ్చుకున్నారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య నువ్వెంత? అంటే నువ్వెంత? అనే రీతిలో సాగుతోంది. ఇప్పుడు తాజాగా మేకల సంత వ్యవహారం మరింత వివాదాన్ని రగిల్చింది. దీనిపై మంత్రి మాణిక్యాలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దశాబ్దకాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కాదని ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి ఎలా ఇస్తామని మాణిక్యాల వర్గం ప్రశ్నిస్తోంది. బాపిరాజు కూడా సీఎం వద్దకు ఈ పంచాయతీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*