వైసీపీలోకి క్యూ కడుతున్న నేతలు

పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఊరారా తిరుగుతున్నారు. జూన్ 2వ తేదీన ప్రత్యేక హోదా కోసం భీమవరంలో ర్యాలీని కూడా నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి యువనేత రాహుల్ ను ఆహ్వానించామని రఘువీరా చెప్పారు. అందుకురాహుల్ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. జూన్ 9, 10వ తేదీల్లో రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తారని రఘువీరా చెప్పారు. ఇదిలా ఉండగా రఘువీరారెడ్డి సొంత జిల్లాలోని కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

మరికొందరు సీనియర్లు….

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనిల్ చౌదరి, మంజునాధ చౌదరితో సహా దాదాపు వెయ్యి కుటుంబాలు జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరాయి. అనంతపురంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వీరు ఈ సందర్భంగా చెప్పారు. అయితే రఘువీరా సొంత జిల్లాలోనే కాంగ్రెస్ రోజురోజుకూ బలహీనపడుతుంది. మరోవైపు కాంగ్రెస్ లో ముఖ్యనేతలందరూ వైసీపీ వైపు చూస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. వీరు గతంలో పార్లమెంటు సభ్యులుగా కూడా పనిచేశారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు రేపో మాపో వైసీపీ గూటికి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో సయితం కాంగ్రెస్ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం వెదుకులాడుకునే పరిస్థితి ఏర్పడింది. అనేకమంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ప్లీనరీకి ముందే ఈ చేరికలు ఉండవచ్చని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*