వైసీపీలో ఎవరి గోల వారిదేనా?

ఇంటింటికి పార్టీని తీసుకువెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని జగన్మోహన్‌ రెడ్డి భావిస్తుంటే వైసీపీలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్రూపుల గోల., ముఠాల పోరుతో నియోజకవర్గాలు సతమతమవుతున్నాయి. ఇవి ఎప్పటికి సద్దుమణుగుతాయో కూడా తెలీని పరిస్థితి నెలకొంది. లక్షలకు లక్షలు ఖర్చు పెడితే చివరకు పార్టీ టిక్కెట్‌ వస్తుందో రాదో కూడా గ్యారెంటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఏది క్లారిటీ…..?

వైసీపీ ఆవిర్భావం తర్వాత తొలి మూడేళ్లు చాలా దూకుడుగా ఉండేది. అప్పట్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా ఒకటి అరా మినహా అన్ని ఆ పార్టీనే దక్కించుకుంది. అయితే ఏడేళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావమే వైఎస్సార్‌ వారసత్వంతో ముడిపడి ఉంది. ఇన్నాళ్లు దానిని కాపాడుకుంటూ వస్తున్నా వచ్చే ఎన్నికల వరకు ఆ ఒక్క అస్త్రమే దానిని కాపాడలేదని స్పష్టమైపోయింది. కానీ అందుకు తగ్గ చికిత్స మాత్రం జరగడం లేదు. వైసీపీ గత ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిస్తే 22మంది పార్టీ ఫిరాయించారు. ఆ స్థానాల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకువచ్చారు. ఇక గతంలో ఓడిపోయిన స్థానాల్లో పాతవాళ్లనే కొనసాగిస్తారా లేదా అనే సందేహం కూడా ఉంది. చాలా నియోజక వర్గాల్లో ఇద్దరు., ముగ్గురు, నలుగురు కూడా తామే అభ్యర్ధులమని ప్రచారం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను అటకెక్కించేశారు. వారిలో ఎవరికి టిక్కెట్‌ దక్కుతుందనే క్లారిటీ వారికే లేకపోవడంతో ఉన్నా లేనట్లుగా నడిపించేస్తున్నారు.

అభ్యర్ధులెవరైనా పెత్తనం వారిదే…..

ఇక రిజర్వుడు స్థానాలు., బీసీలకు కేటాయించిన స్థానాల్లో పార్టీ పెత్తందార్ల హవా సాగుతోంది. ముఠా గొడవల వెనుక పార్టీ తమ సొత్తుగా భావించే వర్గాల వ్యూహం ఉందనేది మరో ప్రచారం. నియోజక వర్గ సమన్వయ కర్తల్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం., తమ చేతి ఖర్చును కూడా వారి జేబు నుంచి తీయించేందుకు ఇలా రెండు మూడు ముఠాలను ఒకరిపై ఒకర్ని ఉసిగొల్పుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో లక్షల్లో ఖర్చు పెట్టి పత్తా లేకుండా పారిపోయిన నాయకులు కూడా వైసీపీలో ఉన్నారు. మళ్లీ తమకు అలాంటి పరిస్థితే రాదనే నమ్మకం ఏముందని అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నారు. చివరి వరకు నాన్చి ఎవరో ఒకరిని అభ్యర్ధి అని ప్రకటిస్తే రెండో వర్గం ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేస్తుందని., ఇలాంటి కారణాలతోనే అభ్యర్ధులు ఓడిపోతారని చెబుతున్నారు. నియోజక వర్గాల్లో పనిచేసుకునే పరిస్థితి కల్పించాలని కోరుతున్న జగన్‌ సహా ముఖ్య నేతలు ఎవరు పట్టించుకోవడం లేదని ఇప్పుడే తొందర ఏముందన్నట్లు వ్యవహరిస్తున్నారని మదనపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*