వైసీపీ నేత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారే?

ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజధానిని ఆనుకునే ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే. అయితే ఆళ్ల అంటేనే ఇప్పుడు అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఆళ్ల… అంటేనే టీడీపీకి వణుకుపుడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు వరకూ ఆళ్ల ఎప్పుడు కోర్టుల మెట్లు ఎక్కుతారోనన్న కంగారు పడిపోతున్నారు. కేవలం న్యాయపోరాటంతోనే అధికార పార్టీని తరచూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇరకాటంలో పడేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలో ఎందరో ఎమ్మెల్యేలున్నారు. వారు కేవలం అధికార పార్టీపై విమర్శలకే పరిమితమవుతారు. ఆ విమర్శలను అధికార పార్టీ పెద్దగా పట్టించుకోదు. కాని ఆళ్ల స్టయిలే వేరు. ఆయన ఎప్పుడూ నేరుగా విమర్శలు చేయరు. అధికార పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. అమరావతి భూ సేకరణ దగ్గర నుంచి నిన్న కృష్ణా నది కరకట్టమీద ఆక్రమణల వరకూ ప్రభుత్వ తీరుపై హైకోర్టులో ఎన్నో కేసులు వేశారు. కొన్నింటిలో న్యాయస్థానం అధికార పార్టీ నిర్ణయాలను తప్పుప్పట్టింది కూడా. ఇలా ఆళ్ల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆళ్ల అధికార పార్టీ గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ఎన్నో నిర్ణయాలు…ఎన్నో కేసులు…ఎన్నో …విజయాలు…ఇలా ఆళ్ల చట్టపరంగా అధికార పార్టీకి ముకుతాడు వేస్తున్నారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

న్యాయపోరాటం ద్వారానే…..

తొలుత అమరావతి నిర్మాణం కోసం భూసమీకరణ ద్వారా భూములను సేకరించాలని ప్రభుత్వం భావించింది. మూడు పంటలు పండే భూములు తాము రాజధానికి ఇవ్వలేమని కొందరు రైతులు అడ్డం తిరిగారు. బాధితుల పక్షాన ఆర్కే దిగి న్యాయపోరాటానికి దిగారు. దీంతో కోర్టు కూడా రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే భూములు తీసుకోవాలని చెప్పడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అలాగే మంగళగిరిలో పేదల ఇళ్ల తరలింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష‌ మీడియాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్కే వ్యతిరేకించారు. దీనివల్ల పేదపిల్లలు నష్టపోతారని కోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రకాశం బ్యారేజీపై భారీ వాహనాలను అనుమతించడంపై కూడా కోర్టుకు వెళ్లారు. ఇందులోనూ ఆర్కే సక్సెస్ అయ్యారు. ఇక కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై కూడా ఆళ్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్టే సాధించారు. ఇక ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ కోర్టుకెక్కారు ఆర్కే. ఆయన విద్యార్హతలపై తన పిటిషన్ లో సందేహం వ్యక్తం చేశారు. దీనిపై కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలపై గతంలో ఉన్న కేసులన్నీ ఎత్తివేస్తూ 132 జీవోలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. అయితే ఈజీవోలను తప్పుపడుతూ ఆర్కే హైకోర్టు గడపను మళ్లీ తొక్కారు. టీడీపీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరించడానికే ఈ కేసులు ఎత్తివేశారని ఆర్కే ఆరోపించారు. దీనిపై కూడా హైకోర్టు నుంచి ఆర్కే స్టే పొందగలిగారు.

ఆళ్ల సక్సెస్ రేటు ఎక్కువే…..

ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసును కూడా ఆళ్ల వదిలిపెట్టలేదు. ఈ కేసులో చంద్రబాబు పాత్రను ప్రశ్నిస్తూ హైకోర్టుకు ఎక్కారు. దీనిపై హైకోర్టు సీఎం చంద్రబాబుకు, తెలంగాణ ఏసీీబీ అధికారలుకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది. ఇక సదావర్తి భూముల విషయంలో అవిశ్రాంతంగా పోరాడారు ఆర్కే. దాదాపు 80 ఎకరాల సదావర్తి సత్రం భూములను తెలుగుదేశం నేతలు కారు చౌకగా కొట్టేశారని ఆరోపిస్తూ హైకోర్టుకు ఎక్కారు. కేవలం 22 కోట్లకే అతి విలువైన భూములు టీడీపీ నేతలు కాజేశారన్నది ఆర్కే వాదన. ఇందులో కూడా ఆర్కే సక్సెస్ అయ్యారు. హైకోర్టు మరోసారి వేలం నిర్వహించాలని నిర్ణయించింది. రెండోసారి వేలంలో వీటి ధర 60.30 కోట్ల రూపాయలకు పలికింది. అంటే ఆర్కే పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలను ఇరకాటంలో పడేశారన్నమాట. ఇక తాజాగా కృష్ణానది కరకట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఏర్పరచుకోవడాన్ని కూడా ఆర్కే తప్పుపట్టారు. పది మందికి నీతులు చెప్పాల్సిన ముఖ్యమంత్రి నదిని ఆక్రమించుకుంటే ఎలా అని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ముఖ్యమంత్రి తో పాటు నదిని ఆక్రమించుకుని కట్టడాలు నిర్మించిన 57 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు అవునో…? కాదో? మూడువారాల్లో చెప్పాలని హైకోర్టు నోటీసుల్లో పేర్కొంది. ఇలా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆర్కే సైలెంట్ గా ఉన్నా….. చేతలు మాత్రం వైలెంట్ గా ఉన్నాయని వైసీపీ నేతలు చమత్కరిస్తున్నారు. ఆర్కే హైదరాబాద్ బయలుదేరితే చాలు టీడీపీ నేతలు వణికిపోతున్నారని కూడా ఎద్దేవా చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1