వైసీపీ, బీజేపీ లోపాయికారీ ఒప్పందమా?

వైసీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ అనధికార ఒప్పందానికి వచ్చాయా? ఎన్నికల ముగిసిన తర్వాత పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయా? ఈ మాటలు ఎవరో అన్నది కాదు. సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నోటి నుంచి వచ్చినవే. ఒక జాతీయ పత్రికలో వచ్చిన వార్తను ఉటంకిస్తూ…తన వద్ద కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉందని చంద్రబాబు నేతలకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తుండటం, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని ఇవ్వకపోవడం వంటి వాటితో ఆంధ్ర ప్రజలు గుండెలు రగులుతున్నాయన్నారు.

ఎన్నికల తర్వాత పొత్తు…..

అందుకే బీజేపీపై అసంతృప్తి తీవ్రంగా ఉండటంతో వైసీపీ నేత జగన్ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదని, ఎన్నికల అనంతరం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన వార్తలను కూడా చంద్రబాబు నేతలకు చూపించారు. అలాగే టీడీపీ బీజేపీకి భయపడే ప్రసక్తి లేదని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు. తనపై అనేక కేసులున్నాయని, వాటికి భయపడే బీజేపీని వదలడానికి ఇష్టపడటం లేదన్న వార్తలను చంద్రబాబు కొట్టిపారేశారు.తనపై ఎన్ని కేసులు గతంలో పెట్టినా అవి న్యాయస్థానంలో నిలబడలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

రాజీనామాలపై వెనక్కు తగ్గం……

వైసీపీ, బీజేపీల అంతర్గత ఒప్పందాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు బాబు ఆదేశించారు. ఏపీ అభివృద్ధి కంటే జగన్ సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారన్న విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. బీజేపీతో విడిపోయినా తమకు వచ్చే నష్టమేదీ లేదన్న చంద్రబాబు, లాభమే ఉంటుందని తెలిపారు. సరైన సమయంలో రాజీనామాల విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. నేతలు సంయమనం పాటిస్తూ వ్యాఖ్యలు చేయాలని సూచించారు. కేంద్రంపై వత్తిడి పెంచేందుకు తొలుత కేంద్రమంత్రుల చేత రాజీనామాలు చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*