వైసీపీ లో లీడర్‌ ఎవరు….?

మూడేళ్ల తర్వాత కష్టపడి ప్లీనరీ నిర్వహిస్తే అందరి అటెన్షన్‌ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త మీదకు పోయింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరగనది., బీహార్‌., పంజాబ్‌లలో జనం ఎరుగనిది ఏపీలో మాత్రమే అసలు విషయం పక్కదారిపట్టింది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రశాంత్‌ కిషోర్‌ వైసీపీకీ మార్గ నిర్దేశం చేస్తాడని జగన్‌ ప్లీనరీ వేదికపై ప్రకటించారు. వైసీపీ నాయకుల భవిష్యత్తు మొత్తం ప్రశాంత్ కిషోర్‌ చేతుల్లో ఉంటుంది అన్నట్లు జగన్‌ మాట్లాడారు. అదే వేదికపై అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనే విషయంలో కూడా జగన్‌ కీలక ప్రకటన చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలను., వాటిని ఎలా అమలు చేస్తామో ప్రకటించారు. కాని ఇప్పుడు మీడియా., ప్రతిపక్షాల అటెన్షన్‌ మొత్తం డైవర్ట్‌ అయిపోయింది. ఎవరో ప్రశాంత్ కిషోర్‌ అట., వైసీపీకి రెక్కలు తొడుగుతారట అనే వార్తలు ఎక్కువైపోయాయి. అదే సమయంలో రాజకీయ పార్టీని నడపలేక కన్సల్టెంట్‌ను పెట్టుకునే పరిస్థితి వైసీపీకి వచ్చిందనే విమర్శలు అధికార పార్టీ నుంచి వస్తున్నాయి. సొంతంగా వ్యూహాలు చేయలేక ఓ వ్యూహకర్తను నియమించుకున్నారని పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రే వ్యాఖ్యనించారు.

అలా చేయకుండా ఉండాల్సింది…..

ఎన్నికల వ్యూహకర్త బ్యాక్‌ ఆఫీస్‌లో ఉంటూ పని చేయాలి. ప్రశాంత్‌ కిషోర్‌ కూడా గుజరాత్‌లో కాగ్‌ ద్వారా తొలినాళ్లలో చేసిన పని ఇదే. కాని ఆ తర్వాతే సొంత పబ్లిసిటీ ఎక్కువైంది. ఇక జగన్‌ కూడా పీకే…..పిఎం., సిఎంలను తయారు చేశాడు., అద్బుతాలు చేస్తాడు అని మాట్లాడటం కూడా అపరిపక్వంగా కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్‌ వ్యూహాలు అమలు చేస్తామని బహిరంగంగా ప్రకటించాక ఇక ఏం చేసినా అది అతని ఖాతాలోకే పోతుంది. రేపు ఎన్నికల్లో వైసీపీ అనూహ్య ఫలితాలు సాధించినా., తారుమారైనా అది అతని ఖాతాలోకే వెళుతుంది. వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు జగన్‌ కావాలి…. అతని నాయకత్వం కావాలే తప్ప ప్రశాంత్‌ కిషోర్‌ కాదు…. ఇక ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమని ప్రకటించడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల గుండెల్లో నిలిచిపోవడమో., ప్రతిపక్షంలోకి తిప్పి పంపడమో అన్నది పాలనా దక్షతపై ఆధారపడి ఉంటుంది. జగన్‌ మనసులో మాటను దాచుకోలేనితనం అధికారకాంక్షగా భావించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సీరియస్‌ పాలిటిక్స్‌లో ఉంటూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి సంబంధించిన వ్యూహకర్త తెరవెనుక ఉండి పనిచేయాలే తప్ప పబ్లిక్‌ పబ్లిసిటీ ఇచ్చుకుంటూ పోతే సినిమాల్లో హారన్‌ కొట్టుకుంటూ వచ్చే పోలీసుల మాదిరి ఉంటుంది. జనం ఓట్లు వేసేది…. నమ్మేది పార్టీని… ఆ పార్టీని నడిపించే నాయకుడ్ని చూసి అన్నది జగన్ మర్చిపోవడం విచిత్రం.

1 Comment on వైసీపీ లో లీడర్‌ ఎవరు….?

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1