సింగ‌పూరంటే మ‌రీ ఇంత లవ్వేంటి బాబూ..?

సింగ‌పూర్‌.. సింగ‌పూర్‌.. సింగ‌పూర్‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబు పొద్దున్నుంచి సాయంత్రం వరకూ వ‌ల్లె వేస్తున్న మంత్రం! రాజ‌ధానిని సింగ‌పూర్ చేస్తాం.. సింగ‌పూర్ స్థాయిలో ఏపీని అభివృద్ధి చేస్తాం.. అమ‌రావ‌తి బాధ్య‌త సింగ‌పూర్ కంపెనీలకే అప్ప‌గిస్తాం.. అంటూ ఆ పదాన్నే జ‌పిస్తూ ఉన్నారు. సింగ‌పూర్ కంపెనీ ఏపీని అభివృద్ధి చేస్తోందా లేక సింగ‌పూర్ అభివృద్ధికి చంద్రబాబే త‌న వంతు సహ‌కారం అందిస్తున్నారా? అనే కొత్త కొత్త సందేహాలు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీకి న‌ష్టం వ‌చ్చినా.. ఖ‌జానాకు చిల్లు ప‌డుతున్నా.. ఆయ‌న నిర్ణ‌యాల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండ‌టం లేదు. ఇప్ప‌టివ‌రకూ చ‌క్కెర్లు కొట్టేసిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను కూడా సింగ‌పూర్ బాట ప‌ట్టించబోతున్నారు.

నష్టాలు వచ్చినా…..

అదెలా అంటే.. విజ‌య‌వాడ నుంచి సింగ‌పూర్‌కి నేరుగా విమానాలు న‌డ‌పాల‌ని ఆ దేశ ప్ర‌భుత్వాన్ని కోరార‌ట‌. అంతేకాదు.. న‌ష్టాలు వ‌చ్చినా ఫ‌ర్లేద‌ట.. ఆ భార‌మంతా ఆయ‌నే మోసేస్తార‌ట‌. సొమ్ము చంద్ర‌బాబుది.. సోకు సింగ‌పూర్‌ది.. ఇది ప్ర‌తి విష‌యంలోనూ రుజువు చేస్తూనే ఉన్నారు టీడీపీ అధినేత‌! సింగ‌పూర్ కంపెనీల‌కి రాజ‌ధాని భూములు చాలా త‌క్కువ ధ‌ర‌కే ధారాద‌త్తం చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది విన్న వారంతా.. చంద్ర‌బాబుకు సింగ‌పూర్ అంటే ఇంత‌ ఇష్ట‌మేంటా అని ముక్కున వేలేసుకుంటున్నార‌ట‌.

అసలు సమస్య ఇదే…..

ఓ వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక, తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అవన్నీ వదిలేసి.. సింగపూర్ కు విమానాలు నడపండి కావాలంటే నష్టాలు వస్తే మేం చూసుకుంటాం.. అంటూ సర్కారు ప్రకటన జారీ చేయటం చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారట‌. కొత్త రాష్ట్రంగా అవతరించిన ఏపీకి విమాన కనెక్టివిటి, అంతర్జాతీయ కనెక్టివిటి రావాటాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఓ వైపు ఏపీలో పలు సమస్యలు ఉంటే.. అవన్నీ వదిలేసి సింగపూర్ కు విమానాలు నడిపే సంస్థలకు సర్కారు ముందుకొచ్చి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ఇవ్వటానికి సర్కారు ముందుకు రావటమే సమస్య.

వారంలో రెండుసార్లు….

విజయవాడ-సింగపూర్-విజయవాడల మధ్య వారంలో రెండు సార్లు విమానాలు నడపాలంట. వీటి నిర్వహణలో నష్టం వస్తే దాన్ని వీజీఎఫ్ ద్వారా సర్దుబాటు చేస్తార‌ట‌. ఈ ప్రతిపాదన ప్రకారం ఎయిర్ లైన్స్ విజయవాడ నుంచి సింగపూర్ కు విమానాలు నడపటానికి ముందుకొస్తే.. వంద సీట్లు ఉన్న విమానం రాకపోకలకు ఓ పది లక్షల రూపాయలు ఖర్చు అయితే.. టిక్కెట్ల బుకింగ్ ద్వారా కేవలం రూ.5ల‌క్ష‌లు వస్తే ఆ ట్రిప్ కు మరో రూ.5ల‌క్ష‌లు సర్కారు భరించాలన్న మాట. అదే సర్దుబాటు నిధి. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తాజాగా అమరావతి వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నెల రోజుల్లో సింగపూర్ కు విమానాలు నడపటానికి ఆయన అంగీకరిచారని ప్రకటించారు. ఇప్పుడేమో సర్వీసులు నడిపే సంస్థలకు వీజీఎఫ్ కింద నిధులు ఇస్తామని చెబుతున్నారు. అసలు విజయవాడ-సింగపూర్ ల మధ్య విమాన సర్వీసులు నడపాలంటే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరగాల్సి ఉంటుంది.

ఇంధనంలోనూ…..

అదే సమయంలో విమానాల్లో ఉపయోగించే ఇంధనం ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) పై ఏపీ సర్కారు పన్నును ఒక శాతానికి తగ్గింది. ఒక రకంగా ఏపీ నుంచి విమాన సర్వీసులు నడిపే సంస్థలకు ఇదే చాలా మంచి ఆఫర్. అది చాలదన్నట్లు.. ఏపీలో అసలు సమస్యలే ఏమీ లేవన్నట్లు చంద్రబాబు విమాన సంస్థల నష్టాలు ప్రభుత్వం భరిస్తుందని చెప్పటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*