సిగ్నల్స్ దొరకకుండా జస్టిస్ తెలివిగా తప్పించుకున్నారే?

జస్టిస్ కర్ణన్ కోసం పశ్చిమ బెంగాల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయితే ఆయన ఆచూకీ ఎక్కడా లభించడం లేదు. జస్టిస్ కర్ణన్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన కాళహస్తి వెళ్లారని తెలుసుకున్న పోలీసులు అక్కడకు కూడా వెళ్లారు. కాని జస్టిస్ కర్ణన్ కాళహస్తిలో లేరు. ఆయన సెల్ ఫోన్ మాత్రమే వెళ్లింది. దీంతో కంగుతిన్న పోలీసులు తమను తప్పుదోవ పట్టించడానికే సెల్ ఫోన్ ను వేరే వ్యక్తితో ఇతర ప్రాంతాలకు పంపినట్లు అర్ధమయింది. అయితే జస్టిస్ కర్ణన్ ఎక్కడకు వెళ్లారన్నది పోలీసులకు అంతుపట్టడం లేదు. జస్టిస్ కర్ణన్ రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ దొరికేంత వరకూ జస్టిస్ కర్ణన్ అందుబాటులోకి రారన్న విషయం పోలీసులకూ అర్ధమైంది.

సుప్రీంకోర్టుకు వినతి…..

అయితే కర్ణన్ దేశ సరిహద్దులు దాటి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన రోడ్డు మార్గం ద్వారా నేపాల్, బంగ్లాదేశ్ వైపు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడటంతో ఆయనకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పు వచ్చిన రోజు నుంచి కర్ణన్ మాయమయ్యారు. జస్టిస్ కర్ణన్ తొలుత చైన్నైకి వెళ్లిన మాట వాస్తవం. అక్కడ తన సన్నిహితులతో ఈ విషయంపై చర్చించారని కూడా చెబుతున్నారు. అయితే కర్ణన్ తెలివిగా తన ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తన సెల్ ఫోన్ ను వేరే వ్యక్తి చేతికిచ్చి కాళహస్తి పంపారు. తను మాత్రం రోడ్డు మార్గం ద్వారా దేశం దాటి వెళ్లిపోయారని భావిస్తున్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే కర్ణన్ ఇతర దేశాల్లో తలదాచుకునేందుకు వెళ్లి ఉంటారని పోలీసులు కూడా చెబుతున్నారు. మొత్తం మీద జస్టిస్ కర్ణన్ పశ్చిమ బెంగాల్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అయితే తాజాగా జస్టిస్ కర్ణన్ ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. అయితే జస్టిస్ కర్ణన్ వినతిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*