సీఎం రమేష్ అసంతృప్తితో రగిలిపోతున్నారా?

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరి మాటను వినడం లేదు. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సూచించిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వకపోవడం ఒకటైతే…కడప జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని అర్ధమవుతోంది. కడప జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. సీఎం రమేష్ పార్టీ అధికారంలోని పదేళ్ల కాలంలోనూ ఆయన పార్టీకి అన్నిరకాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. కాని కడప జిల్లా అధ్యక్షుడి ఎంపికలో సీఎం రమేష్ చెల్లుబాటు కాలేదు. సీఎం రమేష్ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని కొనసాగించ వద్దని అధిష్టానాన్ని కోరారు. ఆయనను తప్పించి కొత్తవారికి స్థానం కల్పించాలని కోరారు. కాని చంద్రబాబు మాత్రం శ్రీనివాసులరెడ్డినే తిరిగి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతో సీఎం రమేష్ కంగు తినాల్సి వచ్చింది.

జిల్లా అధ్యక్షుడి ఎంపికే కారణం……

కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ సీఎం రమేష్ జిల్లాను తన కనుసన్నల్లో నడుపుతున్నారు. కాని జిల్లా అధ్యక్షుడు మాత్రం సీఎం రమేష్ మాట వినడం లేదట. అందుకోసం అనేకసార్లు వీరిద్దరి మధ్య బహిరంగంగానే వివాదాలు బయటపడ్డాయి. పైకి అందరం కలిసి ఉన్నామని చెబుతున్నప్పటికీ సీఎం రమేష్ శ్రీనివాసులరెడ్డి ఎంపికను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మహానాడు ముందే ఈ ఎన్నిక జరగాల్సి ఉన్నా సీఎం రమేష్ వల్లనే ఆగిపోయిందన్న ఆరోపణలూ విన్పించాయి. దీంతో శ్రీనివాసులు రెడ్డి ఇటీవల అధిష్టానాన్ని కలిసి కడప జిల్లాలో పరిస్థితిని వివరించారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా చెప్పడంతో చివరకు చంద్రబాబు కడప జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులురెడ్డినే ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఎం రమేష్ అసంతృప్తికి గురయ్యారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1