సీఎం సొంత ఇలాకాలో జల్లికట్టుకు అంతా సిద్ధం

జల్లికట్టు అంటే తమిళనాడు మాత్రమే గుర్తొస్తొంది. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో గత రెండేళ్లుగా తమిళులు ఆ క్రీడను జరపుకోలేకపోతున్నారు. కాని తమిళనాడు చెంతనే ఉన్న చిత్తూరు జిల్లాలో మాత్రం జల్లికట్టు క్రీడ యమజోరుగా సాగుతుంది. ప్రతి ఏటా ఈ క్రీడ నిరాటంకంగా జరుగుతోంది. అది కూడా పోలీసుల సాక్షిగానే. సీఎం సొంత జిల్లాలోనే ఈ క్రీడ ప్రతి ఏటా నిర్విఘ్నంగా కొనసాగుతోంది.  ఏటా జంతుప్రేమికులు కోర్టులను ఆశ్రయిస్తున్నా ఫలితం లేదు. పశువుల పండగ పేరుతో జరుగుతున్న ఈ జల్లికట్టును మాత్రం ఏపీలో నిషేధించలేదు.

తమిళ సంప్రదాయంలోనే…
తమిళనాడు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలో జల్లికట్టు క్రీడ ప్రసిద్ధి. ఇది ఒకరకంగా తమిళనాడు నుంచి వచ్చిన సంప్రదాయంగానే చెప్పుకోవాలి. కొన్నేళ్ల క్రితం తమిళనాడు నుంచి వలస వచ్చిన వారు ఈ క్రీడకు చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఇక్కడ ఈ క్రీడ ఉందని చెబుతున్నారు గ్రామస్థులు. చిత్తూరు జిల్లా సత్యవేడు నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం వరకూ జల్లికట్టు క్రీడను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. సంక్రాంతి అంటేనే పశువుల పండగ. ఆ నేపథ్యంలోనే ఏపీలోనూ జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు. జల్లికట్టు క్రీడను చంద్రగిరి మండంలం ఎ.రంగంపేట లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ క్రీడను చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు సరిహద్దుల నుంచి కూడా రంగంపేటకు ఆరోజు చేరుకుంటారు. సంక్రాంతి రోజు, పెద్దల పండగ తర్వాత ఈ జల్లికట్టు క్రీడను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పండక్కి రెండు రోజుల ముందు నుంచే పశువులను అలంకరించి పోటీకి సిద్ధం చేసి ఉంచుతారు. దీన్ని ఈ ప్రాంతంలో పశువుల పండగ్గా పిలుచుకుంటారు. రంగంపేటలో పవువుల కొమ్ములను పదునుగా చెక్కుతారు. ఆ కొమ్ములకు కొంత సొమ్మును కూడా కడతారు. రెండు పశువులను వీధిలో వదులుతారు. వీధికి ఇరువైపులా జనం నిల్చుంటారు. పరుగెడుతూ వస్తున్న పశువును అదుపులోకి తీసుకోవాలి. కొమ్మును విరిచిన వారికే ప్రైజ్ మనీ. అదే ఆట. ఈ ఆటలో ఎ.రంగంపేటలో ఎంతోమంది కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నవారున్నారు. అయినా సరే ఈ క్రీడకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గలేదు. తమిళనాడులో జరగకున్నా…ఇక్కడ మాత్రం పశువుల పండగ పేరిట ఏటా జరుపుతూనే ఉంటారు. పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. తమిళనాడు తరహాలో ఆడుతున్నా దీన్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో జల్లికట్టు అని పిలవని పశువుల పండక్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*