సీట్లా..? కోట్లా…?

దాదాపు ఏడాది తర్వాత ప్రధానమంత్రితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కు సంబంధించి అతికీలకమైన సమావేశంగా దీనిని ప్రభుత్వ వర్గాలు, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ కు ముందుగా ఈ సమావేశం జరగనుండటం, రాజకీయంగా కీలకమైన బిల్లులకు టీడీపీ ఆమోదం అవసరముండటమూ, తెలుగుదేశం, బీజేపీ వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలనుకుంటే ఇప్పట్నుంచే ప్రాతిపదిక సిద్దం చేసుకోవాల్సిన ఆవశ్యకత కలగలిసి ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక డిమాండ్లు , తెలుగు దేశం పార్టీకి సంబంధించిన రాజకీయ డిమాండ్లు అనేకం కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి. ఏకమొత్తంగా వీటన్నిటినీ పరిష్కరించడం కేంద్రానికి కూడా కష్టమే. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలు కూడా అదే తరహా డిమాండ్లు చేసే అవకాశాలుంటాయి. కొన్ని రాష్ట్రాలనుంచి అభ్యంతరాలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల వ్యూహాత్మక పంథాలో ఈ భేటీ ముగిసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

రాజకీయ అవసరం…

తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీ బలమైన నాయకులు పెరిగిపోవడంతో తీవ్రమైన వర్గ విభేదాలను ఎదుర్కొంటోంది. పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు ఉన్నప్పటికీ గ్రూపుల కొట్టాట చేటు తెస్తుందేమోనన్న భయం వెన్నాడుతోంది. ప్రస్తుతం ఉన్న శాసనసభ నియోజకవర్గాలను 175 నుంచి 225 కి పెంచడం తక్షణ రాజకీయ అవసరంగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రసమితి కూడా ఇదే డిమాండుతో ఉండటంతో కొంత సానుకూలత కేంద్రం కనబరుస్తుందనే ఆశాభావం ఉంది. చంద్రబాబు నాయుడి పొలిటికల్ అజెండాలో ఈ విషయమే మొదటి అంశంగా ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో శాసనసభ నియోజకవర్గాల పెంపుదల అంశాన్ని చేర్చినప్పటికీ రాజకీయ కారణాలతోనే కేంద్రం పెండింగులో ఉంచింది. బీజేపీ ఏపీ, తెలంగాణ శాఖలు సీట్ల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణలో సీట్లు పెంచితే బలమైన అభ్యర్థులు దొరకరనే అనుమానంతో ఆ పార్టీ ఉంది. ఇంక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడిపై బీజేపీ రాష్ట్ర నాయకులకు ఉన్న అసంతృప్తితో మోకాలడ్డుతూ వస్తున్నారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్నసమయంలో కొంతమేరకు ప్రయత్నం చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు అమిత్ షా అడ్డుపడటంతో పని జరగలేదు. ఇప్పుడు ప్రధానితో జరిగే సమావేశంలో ఒక క్లారిటీ వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అమిత్ షా తో కూడా సమావేశం కానున్నారు. సీట్లు పెరిగితే ఎవరికెన్ని పంపకాలు జరగాలో పక్కాగా ముందస్తుగానే అమిత్ షా డిమాండు చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయ కోణంలో చూస్తే టీడీపీ అవసరాలకు పీఎం భేటీలో పెద్ద పీట వేసే అవకాశాలున్నాయి.

ఆర్థిక సంకటం….

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి జగమెరిగినదే. కేంద్రం ఆదుకోకపోతే రోజువారీ ఖర్చులకు సైతం రానున్న రోజుల్లో కష్టాలు తప్పకపోవచ్చు. అప్పుపుట్టక , రుణ వాయిదాలు చెల్లించలేక ప్రభుత్వం ఒక రకంగా దివాలా తీసిందన్న ముద్ర పడిపోవచ్చు. ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఆర్థిక రాయితీలను ప్రభుత్వం ఆశిస్తోంది. విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు తక్షణ అనుమతి కోరుతోంది. అదే సమయంలో నాబార్డు వంటి సంస్థలు అందించే రుణాలను బడ్జెట్ నిర్వహణ ద్రవ్యపరిమితి చట్ట పరిధిలోకి తేకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. దీనివల్ల కొత్తగా అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. రాజధాని నిర్మాణం, పోలవరం విషయంలో ఉదారంగా నిధులివ్వాలనే డిమాండ్లు ఉన్నాయి. కొత్తగా కేంద్రం గ్రాంట్లు ఇచ్చినా, లేకపోయినా ఈ ఎన్నికల ఏడాది బయట్నుంచి భారీగా రుణాలు తెచ్చి సంక్షేమ రంగంపై వెచ్చించే వెసులుబాటు ఇస్తే అంతేచాలనే భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. దీనికి చట్టపరమైన సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. అయితే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అన్నట్లుగా కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సుహృద్భావ సంబంధాలు ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఏపీ సర్కారును ఆదుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయితే ఇది దొడ్డిమార్గంగానే ఉంటుంది. దేశంలోని మూడొంతుల రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రాయితీలు, మినహాయింపులు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కినుక వహించే అవకాశం ఉంది. అందువల్ల నేరుగా కాకుండా పరోక్ష లబ్ధి చేకూర్చేందుకు కేంద్రాన్ని అంగీకరింపచేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో మాత్రం నిధుల కోసం పట్టుబట్టవచ్చు.

విన్ ..విన్.. కావాలి…

అటు కేంద్రం, ఇటు రాష్ట్రం , అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం రాజకీయంగా, ప్రభుత్వాల పరంగా గెలిచినట్లు కనిపించే విన్ విన్ సిచ్యువేషన్ తో ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశం ముగియవచ్చనే ఆశాభావం ఏర్పడింది. ఒక పార్టీకి మరొక పార్టీ రాజకీయ అవసరంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడి వంటి రాజకీయ చాణక్యుని వ్యూహ నైపుణ్యం బీజేపీకి ఇప్పుడు అవసరమవుతోంది. ఒకవేళ 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా లోక్ సభలో మెజార్టీ సాధించే పరిస్థితులు లేకపోతే ముందస్తుగానే పొత్తులతో చిన్నాచితక పార్టీలను, ఒకటి రెండు పెద్ద ప్రాంతీయ పక్షాలను ఎన్డీఏ గూటికి తెచ్చే బాధ్యతను చంద్రబాబు కు అప్పగించవచ్చనే ప్రచారం కూడా పుంజుకుంది. మోడీ, అమిత్ షాల శకం మొదలయ్యాక బీజేపీలో అగ్ర నాయకులు నామమాత్రంగా మారిపోయారు. కీలక నిర్ణయాల్లో వారెవరూ పెద్దగా భాగస్వాములు కావడం లేదు. అమిత్ షా, మోడీలు కూడా కొన్ని పక్షాలను నేరుగా అప్రోచ్ కాలేని పరిస్థితి కనిపిస్తోంది. మధ్యేమార్గంగా చంద్రబాబు నాయుడి సేవలు ఉపయోగపడవచ్చనే అంచనా. అవుట్ సోర్సింగ్ అయినప్పటికీ చంద్రన్న సేవలు కమలానికి కలిసి వస్తాయని అమిత్ షా, మోడీ భావిస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకులు ఎలా భావించినప్పటికీ బాబు భారీ ప్యాకేజీతో నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగా విన్ ..విన్ దశలో తిరుగు ప్రయాణం అవుతారని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1