సీనియర్లను స్టేట్ దాటించేస్తారా…?

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తుంది. అంతేకాదు అత్యధికంగా పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా వ్యూహాలు రచించుకుంటోంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు జరగకుండా ఈసారి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ శిరసావహించాలన్న సంకేతాలు కూడా కాంగ్రెస్ నేతలకు అందాయి. పార్లమెంటు స్థానం దక్కితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కూడా పార్టీ ఖాతాలోనే పడే అవకాశముంది. అందుకోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్లను ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. పార్లమెంటు సభ్యులుగా సీనియర్లను పోటీ చేయిస్తే ఇటు ఎంపీ సీట్లతో పాటు అటు ఎమ్మెల్యేల సీట్లను కూడా కొల్లగొట్టవచ్చన్నది హస్తం పార్టీ ప్లాన్ గా కన్పిస్తోంది.

సీనియర్లతోనే తలనొప్పులు….

దీంతోపాటు రాష్ట్రంలో సీనియర్లు ఎక్కువగా ఉండటం వల్ల పదవుల కోసం గ్రూపులు కట్టడం, వర్గ విభేదాలతోపార్టీ కుదేలవుతుందని ఆలోచించారు. అందుకోసమే సీనియర్లకు ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలని హైకమాండ్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అసెంబ్లీ స్థానంలో యువతకు ప్రాధాన్యమిచ్చి వారికి అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒకరకంగా వర్గవిభేదాలకు కాంగ్రెస్ అధిష్టానం ఒకరకంగా విరుగుడు మందును కనిపెట్టినట్లేననిచెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అనేకమంది ఉన్నారు.

గ్రూపలగోలతో ఇక్కట్లు….

ప్రతి సీనియర్ సీఎం పదవికి పోటీ పడేవారే. ఎవరి గ్రూపులు వారివే. వారు అనుకున్నదే చేస్తారు తప్ప.. పార్టీ ఆదేశాన్ని ఏమాత్రం పాటించని పరిస్థితి. అయితే ఎన్నోఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లకు అధిష్టానం కూడా గతంలో పదవులు ఇచ్చి గౌరవించింది. కాని సీనియర్లలో సఖ్యత లేని కారణంగా పార్టీ బలపడటం కష్టంగా మారింది. రాష్ట్రం నుంచి నివేదికలు తెప్పించుకున్న హస్తిన పెద్దలు సీనియర్లను తమ వద్దకు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఎంపీ టిక్కెట్ ఇచ్చి ఈ వర్గ విభేదాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అలాగే సీనియర్లలో ఎక్కువ మంది ఒక కుటుంబంలో రెండు టిక్కెట్లు అడటం కూడా ఇబ్బందిగా మారింది.

సీనియర్లకు ఎంపీ టిక్కెట్లు….

ఇందుకోసం పార్లమెంటు సభ్యులుగా పంపించాల్సిన జాబితా కూడా ఖరారయిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో సీనియర్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ఉన్నట్లు చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే తాను ఎంపీగా పోటీ చే్స్తానని ప్రకటించారు. సీనియర్ నేతలందరూ కుటుంబంలో రెండు టిక్కెట్లు ఆశిస్తున్నారు. తమ వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిపై చర్చ జరుగుతున్న మాట వాస్తవమేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే అది ప్రాధమిక దశలోనే ఉందని, దానిపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పడం విశేషం. అయితే ఈ ప్రతిపాదనకు సీనియర్లు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*