సెమీ ఫైనల్స్ కు రెడీ అయిపోయారు…!

2018… ఎన్నికల నామ సంవత్సరం. ఫిబ్రవరి నుంచి డిసెంబరు వరకూ ఏడాదంతా ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి రెండు కాదు…. ఏకంగా ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటం ఈ ఏడాది ప్రత్యేకత. మూడు ఉత్తరాది రాష్ట్రాలుు, నాలుగు ఈశాన్య రాస్ట్రాలు, ఒక దక్షిణాది రాష్ట్రం ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలకు అగ్ని పరీక్ష కానున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, దక్షిణాదిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక, ఈశాన్యాన సీపీఎంకు గట్టి పట్టున్న త్రిపుర, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం మేఘాలయ, ప్రాంతీయ పార్టీ చక్రం తిప్పుతున్ననాగాలాండ్ లో ఎన్నికలు జగరనున్నాయి. వచ్చే ఏడాది ప్రధమార్థంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవి సెమీ ఫైనల్స్ గా చెప్పొచ్చు. అందుకే అన్ని పార్టీలూ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వీటి ఫలితాలు వచ్చే లోక్ సభ ఎన్నికలపై ఎంతో కొంత పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో ప్రభావం చూపించనున్నాయి. ఈ ఎనిమిది రాష్ట్రాల పరిధిలో మొత్తం 99 లోక్ సభ స్థానాలు ఉండటం గమనార్హం.

ఇక్కడ కమలానికి కష్టమేనా?

ముందుగా త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో వచ్చే నెలాఖరున ఎన్నికలకు వెళ్లనున్నాయి. 23 ఏళ్లుగా త్రిపురలో అధికారంలో ఉణ్న సీపీఎం సర్కార్ ను సాగనంపాలన్న పట్టుదలతో కాషాయం పార్టీ ఉంది. 60 స్థానాల త్రిపుర అసెంబ్లీలో 2013లో సీపీఎం 49, కాంగ్రెస్ 10 గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి, అక్కడి నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలే కమలం పార్టీ బలం. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పై గల ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా ప్రజల్లోకి వెళ్లాలని కమలనాధులు భావిస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే పనిగా కనపడటం లేదు. 2014లో ఇక్కడి రెండు లోక్ సభ స్థానాలు సీపీఎం వశమయ్యాయి. మేఘాలయలో ముకుల్ సంగ్మా నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ను అస్థిర పర్చేందుకు కమలం పార్టీ పావులు కదిపింది. ఇటీవల కాంగ్రెస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఇక్కడ కమలం పార్టీకి పరిస్థితి అంత తేలిక కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. నాగాలాండ్ లో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ సర్కార్ నడుస్తోంది. ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. ఇక్కడా కమలనాధులు పాగా వేసేంత పరిస్థితి లేదు. మరో ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో ఈ ఏడాది నవంబరు ఆఖరులో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 5 స్థానాలు గల మిజో నేషనల్ ఫ్రంట్ ఇటీవల బీజేపీలో విలీనమైంది. 40 స్థానాలుగల అసెంబ్లీలో 34 స్థానాలు గల కాంగ్రెస్ ను ఢీకొనడం కమలనాధులకు కష్టమే.

పోటాా పోటీయేనా?

దక్షిణాదిన పెద్ద రాష్ట్రమైన కర్ణాటక ఈ ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. 224 స్థానాలుగల అసెంబ్లీలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 122, బీజేపీ 40, జనతాదళ్ (ఎస్) 40 స్థానాలు గెలుచుకున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ కఠోర పరిశ్రమ చేస్తుండగా, ఒకప్పటి బీజేపీ పాలిత రాష్ట్రాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కమలం పార్టీ పెద్ద కసరత్తే చేస్తోంది. సీఎం సిద్ధరామయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పలకు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా మారనుంది కన్నడ రాజకీయం. 28 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 17, కాంగ్రెస్ 9 గత ఎన్నికల్లో గెలుచుకున్నాయి. అత్యంత కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లలో నవంబరు ఆఖరు, డిసెంబరు మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాదిన అత్యంత కీలకమైనవి ఈ మూడు పెద్ద రాష్ట్రాలు. కమలం పార్టీ ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఉంది. 2003 నుంచి వరుసగా మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. 2013లో మొత్తం 230 స్థానాలకు గాను బీజేపీ 165, కాంగ్రెస్ 58 స్థానాలను గెలుచుకున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 29 లోక్ సభ సీట్లలో 27 స్థానాల్లో బీజేపీ, రెండు కాంగ్రెస్ లు దక్కించుకున్నాయి. 2017 నవంబరులో చిత్రకూట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ 14వేలకు పైగా మెజారిటీతో నెలబెట్టుకోవడంలో పార్టీ శ్రేణుల్లో ధీమా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చౌహాన్ వ్యక్తిగత ప్రతిష్ట పైనే బీజేపీ ఆధారపడుతుంది. పీసీసీ చీఫ్ జ్యోతిరాదిత్య సింధియా,కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ దిగ్గజాలు కూడా ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ప్రణాళికను రచించుకుంటున్నాయి. 90 స్థానాలుగల ఛత్తీస్ ఘడ్లో 2013 ఎన్నికల్లో బీజేపీ 49, కాంగ్రెస్ 39 స్థానాలు గెలుచుకున్నాయి. 11 లోక్ సభ స్థానాలకు గాను 10 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వ్యక్తిగత ప్రతిష్టపైనే పార్టీ ఆధారపడుతోంది. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి పార్టీ నుంచి వైదొలగి సొంత కుంపటి పెట్టుకోవడం కాంగ్రెస్ కు నష్టం కలిగించే అంశం. గత ఎన్నికల్లో అధికారానికి చేరువగా వచ్చామని, ఈసారి అధికారాన్ని కైవసం చేసుకుంటామని హస్తం పార్టీ అంటోంది. రాజస్థాన్ లోని వసుంధరరాజే సర్కార్ పనితీరుపై సొంతపార్టీలోనే సంతృప్తి కానరావడం లేదు. ఆమె ఒంటెత్తు పోకడ, గుజ్జర్ల రిజర్వేషన్ల ఉద్యమం, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఫల్యం పార్టీకి ఇబ్బందిగా మారింది. బీజేపీ అధిష్టానం రాజస్థాన్ పై ఆందోళనగా ఉంది. 2013లో మొత్తం 200 సీట్లకు గాను 165 అసెంబ్లీ స్థానాలు, 2014లో మొత్తం 25 లోక్ సభ స్థానాలు గెలుచుకున్నప్పటికీ పార్టీలో ధీమా కనపడటం లేదు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ లకు, ముఖ్యంగా మోడీ, రాహుల్ గాంధీలకు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. వారి జాతకాలను మార్చేయగల శక్తి ఈ ఫలితాలకు ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1