స్టార్ హీరోలకు సీమ ప్రాంతమే సేఫ్ ప్లేసా?

రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడిన ప్రాంతం. అయితే ఎందరో సినీ రాజకీయ నేతలకు బిక్ష పెట్టింది సీమ గడ్డే. ఎందరో సినిమా స్టార్లు రాయలసీమ ప్రాంతం నుంచీ పోటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. నాటి ఎన్.టి.రామారావు నుంచి నేటి పవన్ కల్యాణ్ వరకూ రాయలసీమనే ఎందుకు ఎంచుకుంటున్నారు? రాయలసీమలో సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా అధికసంఖ్యలో ఉంటారు. సినీ హీరోలు అంటే నాటుకోడి..రాగి ముద్ద అంత ఇష్టం ఇక్కడి ప్రజలకు. రాయలసీమలో ఫ్యాక్షన్ గడ్డ మీద కూడా సీనీస్టార్ల విజయాలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. అందుకే సినీ తారలు రాయలసీమనే ఎంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు అనంతపురం జిల్లా లోని హిందూపురంలోనే పోటీ చేశారు. హిందూపురం నుంచి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచారు. 1985, 1989, 1994 జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. 1989 ఎన్టీఆర్ హిందూపురంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో కూడా పోటీ చేశారు. కాని అక్కడ ఎన్టీఆర్ పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి చిత్తరంజన్ దాస్ చేతిలో ఎన్టీఆర్ ఓడిపోవడం అప్పట్లో సంచలనమైంది. చిత్తరంజన్ దాస్ ను జెయింట్ కిల్లర్ గా కూడా అభివర్ణించారు. ఇక ఆయన కొడుకు బాలకృష్ణ కూడా అదే నియోజకవర్గం నుంచి కంటిన్యూ అవుతున్నారు.

కాటమరాయుడు కూడా….

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. 2009 ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల నుంచి చిరంజీవి పోటీ చేశారు. తన సొంత గ్రామం..పుట్టినిల్లైన పాలకొల్లులో పోటీ చేశారు చిరు. అలాగే తిరుపతిలో కూడా నామినేషన్ వేశారు. ప్రజారాజ్యం పార్టీ కి మంచి ఆదరణ లభిస్తుందనకున్న పశ్చిమగోదావరి పాలకొల్లు నుంచి చిరంజీవి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి అక్కడ గెలుపొందారు. అదే చిరంజీవిని తిరుపతి ప్రజలు చేరదీశారు. తిరుపతిలో బంపర్ మెజారిటీతో చిరును గెలిపించుకున్నారు. తిరుపతి కూడా హ్యాండిచ్చుంటే మెగాస్టార్ కు ఆదిలోనే అవమానం ఎదురయ్యేది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా సీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లానే ఎంచుకున్నారు. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లానో…నెల్లూరు, తిరుపతినో ఎంచుకునే అవకాశముంది పవన్ కల్యాణ్ కు. ఎందుకంటే అక్కడ క్యాస్ట్ ఓట్లతో పాటు పిచ్చిగా పవన్ ను అభిమానించే వాళ్లున్నారు. కాని పవన్ మాత్రం అనంతపురం జిల్లాను ఎంచుకోవడంలో కూడా ఎన్టీఆర్ సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు. ఎన్టీఆర్ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసే ముఖ్యమంత్రి కావడంతో పవన్ కూడా అదే జిల్లాను ఎంచుకున్నారంటున్నారు ఆయన అభిమానులు. అయితే మిరా…మిరా…మీసం అంటూ ముందుకు వస్తున్న కాటమరాయుడికి అనంతపురం సేఫ్ ప్లేస్ అనేది ఆయన అనుచరుల భావన. మొత్తం మీద సీమ జిల్లాలు సినీ స్టార్ లను ఎన్నో ఏళ్ల నుంచి ఆదరిస్తూ వస్తున్నాయి. కాని ఆ ప్రాంత పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేకపోవడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*