స్టెప్ వేయాల్సిందే….కాని అలా కాదు…!

వైసీపీ అధినేత జగన్ ఎంపీల రాజీనామా ప్రకటనతో తెలుగుదేశం పార్టీ కూడా అప్రమత్తమయింది. వచ్చే నెల ఐదో తేదీలోగా కేంద్రం నుంచి రాష్ట్ర విభజన హామీల అమలుపై స్పందన రాకుంటే తమ దారి తాము చూసుకోవాలని నిర్ణయించింది. సీనియర్ నేతలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమావేశంలో సీరియస్ గానే చర్చించారు. బతిమాలితే లాభం లేకపోయిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేయాల్సి ఉంటుందని నేతలకు సూచించినట్లు తెలిసింది. మార్చి 5వ తేదీలోపు తమ డిమాండ్లపై సానుకూల ప్రకటన రాకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయాలన్నది టీడీపీ వ్యూహంగా కన్పిస్తుంది.

మొదటి దశలో….

మొదటి దశలో కేంద్రంలో ఉన్న మంత్రులిద్దరి చేత రాజీనామా చేయిస్తారు. ఆ తర్వాత పార్లమెంటులో ఎంపీలందరూ హామీల అమలుకోసం పోరడతారు. ఆ సమావేశాల్లోనే కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే విధంగా పోరాడం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతూనే మరోవైపు పోరాట పంథాను అనుసరించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అలాగే మార్చి 5వ తేదీ తర్వాత వివిధ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించి ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రాజీనామాలు వద్దంటూనే….

అధికారపార్టీలో ఉండి ఎంపీల రాజీనామాల వరకూ వెళ్లకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. నాలుగేళ్లు మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు రాజీనామాలు చేస్తే ప్రజలు నమ్మరని, అందుకోసం పోరాటమే మంచిదని చంద్రబాబు సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని, కొన్ని హామీలు నెరవేరతాయని చంద్రబాబు సమావేశంలో చెప్పారు. ఢిల్లీ నుంచి తనకు అందిన సమాచారం మేరకు కొన్ని హామీలను నెరవేర్చాలనే కేంద్ర ప్రభుత్వం ఉందని, అయితే రెవెన్యూ లోటు, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టు వంటి విషయాలను వదలిపెట్టకుండా పోరాడాలని ఆయన నేతలకు సూచించారు. అలాగే ప్రతిపక్ష నేత జగన్ రాజీనామాలు అంతా డ్రామానేనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా చంద్రబాబు సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1