హాలీడే మూడ్ లో అన్న‌య్య‌.. ప‌వ‌ర్ ప్లేలో త‌మ్ముడు

`వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకే వెళ్ల‌డం లేదు. ఇక ప్రజా స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు ఏం చేస్తారు` అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లకు కౌంట‌ర్‌గా.. కొంత‌మంది నాయ‌కులు కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి ప్రస్తావ‌న తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే! ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని ఎంపీలు పార్ల‌మెంటు వ‌ద్ద నిర‌స‌న‌, ఆందోళ‌న‌లు చేస్తున్నా.. ఒక్క‌సారైనా క‌నిపించ‌లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మ‌రి ఈ విష‌యం అన్న చిరంజీవి వ‌ర‌కూ వెళ్లిందో లేదో ఏమోగానీ.. తాను పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రుకాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు పంపించా రు మెగాస్టార్ చిరంజీవి. ఇంత ముఖ్యమైన, కీల‌క‌మైన స‌మావేశాల‌కు రాలేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. హాలిడేలో ఉన్నార‌ట‌! అంతేకాదండోయ్‌… ఇందుకు సంబంధించి లీవ్ లెట‌ర్‌ను కూడా పంపించార‌ట‌.

చిరు జాడ ఎక్కడ?

ఢిల్లీలో హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. మొన్న‌టివ‌ర‌కూ వైసీపీ అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు నోటీసులిస్తే.. ఇప్పుడు ఎన్డీఏ నుంచి బ‌య‌టికొచ్చిన టీడీపీ కూడా అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంటారో తెలియ‌ని ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో అంద‌రూ స‌మ‌ష్టిగా పోరాడాలి. కానీ కాంగ్రెస్ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న చిరంజీవి ఒక్క‌సారి కూడా అక్క‌డ క‌నిపించిన దాఖ‌లాలు లేవు. కానీ ఆయ‌న్ను ప‌ట్టించుకోకుండా.. వైఎస్సార్ సీపీ స‌భ్యులు అసెంబ్లీకి హాజరు కావాలి, అసెంబ్లీకి గైర్హాజరు కావడం తగదు అని ప‌వ‌న్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు దుమార‌మే రేపాయి.

ఫిరాయింపుల విషయంలో మాత్రం….

మొన్న నిర్వ‌హించిన జ‌న‌సేన‌ ఆవిర్భావ సభలోనూ.. నిన్న గుంటూర్లో తిరుగుతూ అదే మాట మాట్లాడాడు. అయితే వైసీపీ అసెంబ్లీకి రాక‌పోవడాన్ని తప్పు పడుతున్న పవన్ కళ్యాణ్.. ఫిరాయింపుల విషయంలో మాత్రం ఇంత వరకూ మాట్లాడలేదు. 23మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అనేక మార్లు స్పీకర్ ను కోరింది. కోర్టుకు వెళ్లింది. అయినా ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని ఉప్పు పాతర వేసిన అసెంబ్లీకి తాము రావడం ఎందుకు? అనే ప్రశ్నతో సభకు రానని ప్రకటించింది. ఈ విషయం అర్థంకావడం లేదో లేక అర్థమై నటిస్తున్నాడో.. కానీ హితబోధలు చేస్తూ ఉన్నాడు పవన్.

సెలవు చీటీ పంపి….

ఇలా ఉంటే చిరంజీవి రాజ్యసభకు సెలవు చీటీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య ప్రస్తావించారు. తను వేరే పనుల మీద ఉన్నాను అని, హాలిడేలో ఉన్నాను అని.. అందుకే రాజ్యసభకు రాలేకపోతున్నాను అని చిరంజీవి లెటర్ ఇచ్చాడని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. ఒకవైపు ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంటులో అంత రచ్చ జరుగుతూ ఉంటే.. చిరంజీవి తాపీగా సెలవు పెట్టార‌ట‌. `హాలీడేలో ఉన్నాను సభకు రాలేకపోతున్నాను` అని చెప్పార‌ట. అయినా ఇన్నాళ్లూ సభలో చిరంజీవి చేసింది ఏమీలేదు. సాధించింది ఏమీలేదు. ఇప్పుడు కొత్తగా సెలవు చీటీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం కూడా ఏమీ లేదు. మ‌రి వైసీపీ వాళ్లు అసెంబ్లీకి రావాలి.. అంటూ అర్థం పర్థంలేని క్లాసులు పీకుతున్న పవన్ కు.. అన్నగారి సెల‌వుల విషయం తెలియదేమో పాపం!