హీరో మహేష్ బాబు ఇప్పుడు ఆ గ్రామానికి విలన్

సెలబ్రటీలు, రాజకీయ నేతలు తమ సంపాదించేదాంట్లో కొంత మొత్తాన్ని జనసేవకు వినియోగించుకోవాలనుకుంటారు. ముఖ్యంగా మోడీ సర్కార్ వచ్చిన తర్వాత దత్తత గ్రామాల సంఖ్య పెరిగిపోయింది. పార్లమెంటుసభ్యులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే రాజ్యసభ సభ్యుడైన సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిక గ్రామాన్ని తీసుకున్నారు. ఆ గ్రామానికి సచిన్ కొంత నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే సెలబ్రటీలందరూ ముందుకొచ్చి తమ సంపాదనలో కొంత భాగాన్ని వెచ్చించేందుకు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇందులో హీరో మహేష్ బాబు కూడా ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబుకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఏపీలోని తన సొంతూరైన బుర్రిపాలెం గ్రామాన్ని మహేహ్ బాబు దత్తత తీసుకున్నారు. అయితే అక్కడ అభివృద్ధి అంటూ ఏమీ జరగడం లేదన్న విమర్శలు ఆ గ్రామస్థులే చేస్తున్నారు. చిన్నా చితకా రోడ్లు, బస్ షెల్టర్ల నిర్మాణం తప్ప మహేహ్ బాబు సొంత నిధులు ఏమీ వెచ్చించలేదంటున్నారు. ఆయన బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఆ గ్రామంలో కొన్నిపనులు చేపట్టారు.

ఎక్కడి సమస్యలు అక్కడే……

ఇక మహేష్ బాబు తెలంగాణలోని తన ఫ్యాన్స్ ను పదిలంగా కాపాడుకోవడానికి రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో ఎక్కువగా తండాలే ఉంటాయి. పూర్తిగా వెనకబడిన ప్రాంతం. మహేష్ బాబు తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని తెలియగానే ఆ గ్రామ ప్రజలు, యువకులు తెగ సంబర పడిపోయారు. టపాసులు కూడా కాల్చేశారు. అయితే ఆగ్రామానికి మహేష్ బాబు చేసింది శూన్యమంటున్నారు. చిన్న పాటి బస్ షెల్టర్ నిర్మించారు తప్ప పాఠశాల నిర్మాణానికి ఇస్తానన్న 80 లక్షల సొమ్మును ఇంతవరకూ ఇవ్వలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రోడ్ల పరిస్థితి బాగాలేదు. ఎక్కడ చూసినా గుంతలే. తాగునీటి సౌకర్యం అసలే లేదు. మహేష్ బాబు రాకతోనైనా తమ గ్రామం దుస్థితి నుంచి బయటపడుతుందని ఆశించిన ఆ గ్రామ ప్రజల ఆశలు నిరాశే అయ్యాయి. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ రెండుసార్లు గ్రామానికి వచ్చి పరిశీలించారు తప్ప మూడేళ్లవుతున్నా ఆ గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే…. మహేష్ బాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ప్రభుత్వం కూడా ఇచ్చే నిధులు ఆపేసిందట. పాపం… ఆ గ్రామస్థులు రెంటికీ చెడ్డ రేవడిలా మారారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*