అభిమన్యుడు మూవీ రివ్యూ

ప్రొడక్షన్ కంపెనీ: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
నటీనటులు: విశాల్, సమంత, సీనియర్ హీరో అర్జున్, రోబో శంకర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: యువన్ శంకర్ రాజా
ప్రొడ్యూసర్: విశాల్ కృష్ణ (తెలుగు హరి)
డైరెక్టర్: పి.స్. మిత్రన్

తెలుగువాడైన విశాల్ హీరోగా తమిళంలో స్థిరపడ్డాడు. అక్కడ సక్సెస్ఫుల్ హీరోగా నిర్మాతగా కొనసాగుతూ సినిమాల మీద సినిమాలు చెయ్యడమే కాదు.. తన ప్రతి సినిమాని తన మాతృ భాష అయిన తెలుగులోనూ విడుదల చేస్తూ ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒకప్పుడు విశాల్ పందెం కోడి వంటి సూపర్ హిట్స్ తో దూసుకుపోయినప్పటికీ…. మధ్యలో మాస్ కథలంతో చాలా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. అయితే ఎప్పుడూ గంభీరంగా ఉండే విశాల్ కి ఎక్కువగా.. పోలీస్, డిటెక్టీవ్ కథలయితేనే నప్పుతాయనే విషయాన్ని బాగా తెలుసుకున్నట్టుగా ఉన్నాడు. అందుకే గత సినిమా ‘డిటెక్టీవ్’ సినిమాని మిస్స్మిన్ దర్శకత్వంలో చేసాడు. ఆ సినిమాలో పోలీస్ లు కూడా ఛేదించలేని కేసుల్ని ఎంతో తెలివిగా… ఛేదిస్తూ గంభీరమైన డిటెక్టీవ్ గా విశాల్ హిట్ కొట్టడమే కాదు.. ఆ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకొచ్చేసాడు. డిటెక్టీవ్ కుండాల్సిన డ్రెస్ సెన్స్, ఫేస్ ఎక్సప్రెషన్స్ , కేసులను డీల్ చేసే విధానం, డిటెక్టీవ్ స్టయిల్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ విశాల్ కొత్తదనం చూపించాడు. అందుకే ఈ సినిమాకి అటు కోలీవుడ్ ప్రేక్షకులు, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆ కాన్ఫిడెంట్ తోనే మరోమారు విశాల్ డైరెక్టర్ మిత్రన్ దర్శకత్వంలో మళ్ళీ ఒక ఇన్వెస్టిగేషన్ కథతో ‘అభిమన్యుడు’ అంటూ ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ‘అభిమన్యుడి’గా విడుదలవుతున్న ఈ సినిమా తమిళంలో ‘ఇరుంబు తిరై’ అనే పేరుతొ మే 11 నే కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆసాంతం ఆసక్తిగా.. ట్విస్టులతో సాగిన ‘ఇరుంబు తిరై’ ని తమిళ ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. మరి అక్కడ విడుదలైన కొద్దీ రోజుల గ్యాప్ తో తెలుగులో విడుదలవుతున్న ‘అభిమన్యుడు’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. విశాల్ ‘డిటెక్టీవ్’ సినిమా హిట్ కావడం, అలాగే అక్కినేని వారి కోడలు సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా మెరుపులు మెరిపించడం, యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వంటి విషయాలతో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మరి విశాల్ ‘అభిమన్యుడు’ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడా..? ‘రంగస్థలం, మహానటి’ సినిమాల హిట్ పరంపర సమంత ‘అభిమన్యుడు’తో కొనసాగించిందా..? ‘లై, నా ఆపేరు సూర్య’ సినిమాల్తో దెబ్బతిన్న యాక్షన్ కింగ్ అర్జున్ ఈ ‘అభిమన్యుడు’తో ఈసారి ఎంతవరకు ఆకట్టుకున్నాడో.. అనే విషయాల్ని సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
కరుణాకరన్ (విశాల్)తండ్రి అప్పులు చేయడం, అప్పులవాళ్లు ఇంటికి వచ్చి అడిగితే తప్పించుకొని తిరగడంతో తన తల్లి ఆఖరికి తాళిబొట్టు అమ్మి ఆ.. అప్పులు తీర్చడం వంటి వాటితో విసిగి వేసారిపోయిన కరుణాకరన్ అలియాస్ కర్ణ చిన్నప్పుడే అంటే 12 ఏళ్ళ వయసులోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినా కర్ణ మిలటరీ లో జాయిన్ అవుతాడు. విపరీతమైన కోప లక్షణాలున్న కర్ణ మిలటరీలో ట్రైనింగ్ ఆఫీసర్ గా ఉంటాడు… అనుకోకుండా… మిలటరీ నుండి బయటికి వచ్చి తన చెల్లి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే తన చెల్లి పెళ్లి కోసం కావలసిన డబ్బుకోసం నానా తంటాలు పడతాడు. బ్యాంక్ లోన్ కోసం వెళితే.. మిలటరీలో పనిచేస్తున్నావ్ గనక లోన్ ఇవ్వము.. ఏదైనా ష్యురీటి ఉంటే పెట్టమంటారు బ్యాంక్ వాళ్ళు. చివరికి ఎక్కడా లోన్ దొరకకపోతే ఓ ఏజెంట్ సహాయంతో ఫేక్ సర్టిఫికేట్స్‌తో తన తండ్రి పేరు మీద ఆరు లక్షల లోన్ తీసుకుంటాడు. డబ్బు అకౌంట్ లోకి వచ్చిన మరుసటి రోజునే ఆరు లక్షలతో పాటు తన అకౌంట్‌లో ఉన్న మరో నాలుగు లక్షలు మొత్తం పది లక్షల రూపాయలు మాయమైపోతాయి. ఇలా డబ్బు పోగొట్టుకుంది తను ఒక్కడు మాత్రమే కాదని చాలా మంది అమాయకులు ఇలానే నష్టపోయారని తెలుసుకుంటాడు. దీనంతటికీ కారణం వైట్ డెవిల్ (అర్జున్) అని కర్ణకు తెలుస్తుంది. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్నంత‌టినీ త‌న గుప్పిట్లో పెట్టుకుని.. అమాయ‌కుల్ని దోచుకుంటున్న వైట్ డెవిల్‌కి పెద్ద నెట్ వ‌ర్కే ఉంటుంది. మరి అంత నెట్ వర్క్ ఉన్న వైట్ డెవిల్ ని కర్ణ ఎలా ఫెస్ చేస్తాడు? అసలు వైట్ డెవిల్ వీటన్నికి మూలం అని ఎలా తెలుసుకుంటాడు? అసలు మిలటరీ క్యాంప్ లో ఉన్న కర్ణ.. అక్కడినుండి ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది? తర్వాత కర్ణ వైట్ డెవిల్‌ని ఎలా అంత‌మొందించాడు? అసలు లతాదేవి (సమంతా) అనే సైకియాట్రిస్ట్‌ కి కర్ణ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:
అభిమన్యుడు ఉంటె.. ఇలానే ఉంటాడా.. అన్నట్టుగా ఉంది విశాల్ కర్ణ పాత్ర. కర్ణ త‌న‌కు త‌గిన న్యాయం చేసాడు. ఎక్క‌డా అన‌వ‌స‌రంగా హీరోయిజం చూపించ‌లేదు. మీలాటి క్యాంపులో కోపిష్టి ట్రైనింగ్ ఆఫీసర్ గా, సైకియాట్రిస్ట్‌ దగ్గర సంతకం కోసం పడే పాట్లు, చెల్లికి పెళ్లి చెయ్యడానికి పడే తపన, ఆ పెళ్లి కోసం కావాల్సిన డబ్బు కోసం పడే కష్టం, ఆ తర్వాత అకౌంట్ లో నుండి డబ్బు మాయమైనప్పుడు చూపించిన ఫేస్ ఎక్సప్రెషన్స్, ఆ డబ్బు కోసం కంటికి కనబడని శత్రువు తో యుద్ధం చెయ్యడం.. ఇలా ప్రతి ఒక్క ఎమోషన్ ని విశాల్ ఎక్సలెంట్ గా క్యారీ చేసి అదుర్స్ అనిపించాడు. ఇలాంటి పాత్రలు విశాల్ కి కొట్టిన పిండే. అయినా.. కర్ణ పాత్రలో కొత్తదనం చూపించాడు విశాల్. ఇక విశాల్ తో సమానం అనే కంటే… విశాల్ కన్నా ఎక్కువ పవర్ ఫుల్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ అందరిని ఆకట్టుకున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ అభిమన్యుడు సినిమాకి ప్రాణం పోసాడని చెప్పొచ్చు. వైట్ డెవిల్ పాత్రని అవలీలగా చేసినా.. విశాల్ పోషించిన కర్ణ పాత్ర కంటే వైట్ డెవిల్ పాత్రే ప్రేక్షకులకు ఎక్కువ‌గా గుర్తుండిపోతుంది. అంత స్టైలీష్‌గా ఉంది అర్జున్ నటన. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ విశాల్ ని ముప్పుతిప్పలు పెట్టె వైట్ డెవిల్ పాత్రలో అర్జున్ ని తప్ప మరెవ్వరిని ఊహించలేం. ఇక ఈ సినిమాలో స‌మంత ఎప్పుడూ న‌వ్వుతూ ఉండే లతాదేవి అనే సైకియాట్రిస్ట్‌ పాత్రలో గ్లామర్ గ స్టైలిష్ గా మెప్పించింది. అసలు సమంత పాత్ర‌నీ బాగానే వాడుకున్నార‌ని చెప్పాలి. చీర కట్టులో అందంగా కనబడిన సమంత.. సాంగ్స్ లో మాత్రం గ్లామర్ ఒలకబోసింది. కాకపోతే… విశాల్ ప‌క్క‌న మ‌రీ పొట్టిగా క‌నిపించింది. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు:
అభిమన్యుడు సినిమాకి యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. ముఖ్యంగా విలన్ పాత్ర తెరపై కనిపించే ప్రతిసారి వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. పాటలు కూడా పర్వాలేదనిపించాయి. ఈ సినిమాకి మెయిన్ హైలెట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. యాక్షన్ సన్నివేశాల్లోను, మిలటరీ బ్యాగ్ద్రోప్ చూపించిన విధానం సూపర్ గా అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలున్నాయి. ఈ సినిమాని విశాల్ నిర్మించాడు. ఎక్కడ నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి లేదు. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు అనే చెప్పాలి.

విశ్లేషణ:
దర్శకుడు మిత్రన్ అనుకున్న పాయింట్ ని స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేసాడు. డిజిటల్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే ఎలా చిక్కుకుంటున్నామో కళ్లకు కట్టిచూపించారు. మ‌న చేతిలోని స్మార్ట్‌ఫోనే మ‌న జీవితాన్ని మ‌రొక‌డి చేతుల్లో ఎలా పెడుతుందో.. టెక్నాలజీ యుగంలో మనం ఎంత ప్రమాదపు అంచున ఉన్నమో అలర్ట్ చేస్తూ యాక్షన్ థ్రిల్లర్‌ను అందించారు దర్శకుడు. అనునిత్యం మనకు ఎదురయ్యే వాస్తవ పరిస్థితుల్ని తెరపై చూపించాడు. సైబ‌ర్ నేర‌గాళ్ల చేతుల్లో పడకుండా హెచ్చరించారు. డిజిట‌ల్ క్రైమ్, సైబ‌ర్ నేరాలు బారిన పడకుండా ఇప్పుడున్న పరిస్థితిల్లో ఈ సినిమా చాలా అవసరమే. అసలు అభిమన్యుడు సినిమా చూస్తున్నంత సేపు… ఆ అభిమన్యుడు పాత్రలో మనల్ని మనం ఊహించుకుంటాం. ప్రతి రోజు కాల్ సెంటర్స్, బ్యాంక్స్ నుండి కాల్ చేసి మీకు ఆ లోన్ ఇస్తాం.. ఈ లోనే ఇస్తాం.. తీసుకోండి అంటూ తెగ బ్రైన్ తింటారు. అసలు వాళ్లకి మన ఫోన్ నెంబర్స్ ఎలా వెళ్తున్నాయని ఒక్కసారైనా సీరియస్‌గా ఆలోచించామా.. లేదు. ఏదో ఫోన్ వచ్చింది ఆన్సర్ చేశాం.. లేదా కట్ చేసి పక్కన పడేస్తాం. కానీ మనకు తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి మన డేటాను వాళ్ల దగ్గర పెట్టుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్‌ను సరిగ్గా ఉపయోగించడం తెలిసినవాడికి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు ఆయుధం. అయితే మనం పైన చెప్పిన విషయంలో ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వల్లే ఫ్రీగా ఏదన్న వస్తుంది అంటే తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎదుటువారికి ఇచ్చేస్తారు. దీన్నే ఒక కథగా తీసుకుని అభిమన్యుడు రూపంలో మలిచాడు దర్శకుడు మిత్రన్.

దర్శకుడు మానవుని దైనందిన జీవితంలో జరిగే సైబ‌ర్ క్రైమ్ నేరాలు ఓ వైపు చెబుతూనే కర్ణ వ్య‌క్తిగ‌త జీవితం మ‌రోవైపు చూపిస్తూ…. ప్రేక్షకుడిని కట్టిపడేసాడు. ఆర్మీలో ట్రైనింగ్ ఆఫీసర్ కి కోపం ఎక్కువైతే … కలిగే పరిణామాలను చూపిస్తూనే.. రక్తసంబందానికి ఇచ్చే విలువ…అలాగే ఒక సైక్రటిస్ట్ చెబితే… తన ఫ్యామిలీ కోసం వెళ్లడం ఒక ఎత్తు అయితే… చెల్లెలి పెళ్లి కి లోన్ ట్రై చెయ్యడం.. ఎలాగో లోన్ దొరికాక.. ఆ డబ్బు తనకు తెలియకుండానే మాయమవడం… ఆతరవాత కంటికి కనబడని వైట్ డెవిల్ తో యుద్ధం చెయ్యడం.. చివరికి ఆ విలన్ ని పట్టుకోవడం వంటి విషయాలతో దర్శకుడు కథని, కథనాన్ని ఆసక్తిగానే నడిపించాడు. విశాల్ కూడా కర్ణ పాత్రని బాగా హ్యాండిల్ చేసాడు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ని వైట్ డెవిల్ పాత్రకి ఎంపిక చేసి.. సినిమా సక్సెస్ లో సగం క్రెడిట్ కొట్టేసాడు దర్శకుడు. విలన్, హీరో ఎదురైనపుడు వచ్చే డైలాగ్స్, యాక్షన్ పార్ట్ అంతా ఆకట్టుకునేలాఉంది. కాకపోతే సమంత పాత్రని మరి తీసేసినట్టుగా దర్శకుడు డిజైన్ చేసాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే సమంత నవ్వు కొన్నిసార్లు ఆ నవ్వే బోర్ కొట్టిస్తుంది. కాకపోతే గ్లామర్ పరంగా బాగానే వాడుకున్నాడు. ఇక అర్జున్ ని మాత్రం కావాల్సిన విధంగా వాడుకున్నాడు దర్శకుడు మిత్రన్. మొత్తానికి మనుషులు సైబర్ క్రైం నేరాల్లో ఎలా కొట్టుకుపోతున్నారో… అనే విషయాన్నీ అభిమన్యుడు రూపంలో ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పి ప్రేక్షకుల మనసులను దోచేశాడు. మరి కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ అభిమన్యుడు తెలుగు ప్రేక్షకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో అనేది కొద్దిగా వేచి చూడాల్సిన విషయమే.

ప్లస్ పాయింట్స్: విశాల్ నటన, అర్జున్ పాత్ర, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైరెక్టన్, కథ, కథనం
మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్, ఎంటర్టైన్మెంట్ లోపించడం, హీరో పాత్రని విలన్ డామినేట్ చెయ్యడం, ఎడిటింగ్

రేటింగ్: 2.75 /5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*