ఆదాలది కూడా ఆనం రూటేనా?

ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి. నెల్లూరుజిల్లాకు చెందిన కీలక నాయ‌కుడు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఈయ‌న ప్ర‌స్తుతం తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డికి బల‌మైన పోటీ ఇచ్చిన ఆదాల చివ‌రి నిముషం వ‌ర‌కు నువ్వా-నేనా అనే రేంజ్‌లో పోటీ ఇచ్చారు. మేక‌పాటికి 576,396 ఓట్లు వ‌స్తే.. ఆదాల కూడా ఇదే రేంజ్‌లో 562,918 ఓట్లు సాధించారంటే.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న హ‌వా ఏ రేంజ్‌లో ఉందో అర్ధ‌మ‌వుతుంది. కేవ‌లం 13 వేల స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆదాల‌కు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ సీటు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీ నాలుగేళ్లు గ‌డిచినా తీర‌లేదు. ముఖ్యంగా త‌న ఎదుగుద‌ల‌కు మంత్రి నారాయ‌ణ అడ్డుప‌డుతున్నార‌ని ఆదాల మొద‌టి నుంచి విమ‌ర్శిస్తున్నారు.

ఇద్దరు నేతలు పంచుకుని…..

అంతేకాదు, త‌న‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు వ‌ద్ద ఫిర్యాదులు మోసుకెళ్లింది కూడా నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిలేన‌న్న‌ది ఆదాల విమ‌ర్శ‌ల ప‌ర్వంలో కొన్ని. నెల్లూరును ఈ ఇద్ద‌రు నాయ‌కులు పంచుకుని ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, మిగిలిన నేత‌ల‌ను ఎద‌గ‌నివ్వ‌డం లేద‌న్న‌ది కూడా ఆదాల కామెంట్‌. దాదాపు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరని, అక్కడ జరుగుతున్న వాస్తవాలను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా ఈ ఇద్ద‌రు మంత్రులు చ‌క్రం తిప్పుతున్నార‌ని ఆయ‌న బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు.

తప్పుడు ప్రచారం చేస్తూ…

గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి కోట్లు ఖ‌ర్చుపెట్టినా ఓడిపోయిన త‌న‌కు గుర్తింపు కలిగిన పదవిని ఇప్పించాల్సిన మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్రయాదవ్‌లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన స‌న్నిహితుల వ‌ద్ద ఇన్‌సైడ్‌గా వాపోతున్న‌ట్టు తెలుస్తోంది. నిన్న కాక మొన్న పార్టీలో చేరిన ఆనం సోదరులు ఇద్దరూ ఎమ్మెల్సీ పదవి తనకు కావాలంటే తనకు కావాలని కోరారని ఇప్పుడు చెబుతున్నారని…అప్పట్లోనే తన పేరును ఎందుకు జిల్లా మంత్రులు పరిశీలించలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.

బిల్లులు చెల్లించకుండా….

కోవూరు, నెల్లూరు, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లో వైసీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వగలిగిన ధీటైన అభ్యర్థులు ఏరని ఆదాల ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నా…ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, ఎంపీగా పోటీ చేయమంటే పోటీ చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, మళ్లీ తాను కాంట్రాక్టులు చేయలేదని, అయినా తనకు బిల్లులు చెల్లించకుండా..మంత్రులు అడ్డుపడుతున్నారని.. . ఆయనఅంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తీవ్ర అస‌హ‌నంతో ఆయ‌న ర‌గిలిపోతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి చ‌క్క‌దిద్ద‌క‌పోతే.. తాను చేయాల్సింది చేస్తాన‌ని కూడా ఆదాల హెచ్చ‌రిస్తుండ‌డం పార్టీలో గుబులు రేపుతోంది. మ‌రి బాబు ఇప్ప‌టికైనా ప‌ట్టించుకుంటారో.. లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*