ఆదాల‌కు లైఫ్ ఇచ్చిన ఆనం..!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు అంటారు! నేత‌ల మ‌ధ్య పోటీ ఉన్నా.. ఒక్కొక్క‌సారి ఆ నేత‌లే ఒక‌రికొక‌రు సాయం చేసుకుంటార‌ని అంటారు. అయితే, ఈ సాయం ప్ర‌త్య‌క్షంగా కావొచ్చు.. ప‌రోక్షంగా కావొచ్చు! ఏదేమైనా ఇప్పుడు ఇలాంటిదే నెల్లూరులోనూ జ‌రుగుతోంది. నెల్లూరు రాజ‌కీయాలో ఆనం పేరు తెలియ‌ని వారు లేరు. ఈ ఇద్ద‌రు సోద‌రుల్లో వివేకానంద రెడ్డి ఇటీవ‌ల మృతి చెందారు. ఇక‌, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్తును వెతుక్కుంటూ వైసీపీలోకి జంప్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఆయ‌న టీడీపీని వీడుతుండ‌డం పార్టీకి న‌ష్ట‌మో.. లాభ‌మో.. తెలియ‌దు కానీ.. ఇక్క‌డ ఎద‌గాల‌ని భావిస్తున్న ఆదాల ప్ర‌భాక‌ర‌రెడ్డికి మాత్రం భారీ ఎత్తున ల‌బ్ధి చేకూరుస్తోంద‌ని అంటున్నారు ఆదాల వ‌ర్గీయులు.

ఆదాలకు డిమాండ్…..

దీంతో నెల్లూరు జిల్లా తెలుగుదేశంలో ప్రస్తుతం ఆదాల ప్రభాకరరెడ్డి హాట్‌ టాపిక్‌గా మారారు. కొన్ని నెలల క్రితం వరకు నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ కార్యకలాపాలకు మాత్రమే పరిమి తమైన ఆదాల ఒక్కసారిగా పార్లమెంట్‌ స్థానం పరిధిలో ని పలు నియోజకవర్గాలకు అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. ఆనం నిష్క్రమణ తరువాత టీడీపీలో ఆదాలకు డిమాండ్‌ పెరిగింద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈయన పేరు పార్టీలో మార్మోగిపోతోంది. గత ఎన్నికల్లో ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్థి మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డిపై ఓడి పోయారు. అయితే ఆ తరువాత పార్టీ నాయకులు తనకు విలువ ఇవ్వలేదనే మనస్తాపంతో పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టనట్టు వ్యవహరించారు.

ఇద్దరూ మిత్రులుగా…..

నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా, అదే సమయంలో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా రూరల్‌ నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు. అయితే ఆనం పార్టీని వీడాక ఈయనకు పార్టీలో విలువ పెరిగింది. ఇది జరగడానికి కొద్ది రోజుల ముందు వరకు ఆనం, ఆదాల అత్యంత సన్నిహితులుగా మెలిగారు. ఆత్మకూరు మినీ మహానాడు, రూరల్‌ నియోజకవర్గ మినీ మహానాడుల్లో ఆదాల మంత్రి సోమిరెడ్డిని టార్గెట్‌గా చేసుకొని మాట్లాడగా, ఆనం ఏకంగా ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేశారు. ఆనం పార్టీ మారుతారనే ప్రచారం జరిగిన సందర్భంగా ఆదాల కూడా అదే దారిలో పయనిస్తారనే ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై జిల్లా మినీ మహా నాడులో ఆదాల స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. తను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఆయనను చేజార్చుకోకూడదని….

ఆనం అనుభవాల నేపథ్యంలో ఆదాలను చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో అధిష్ఠానం ఆదాలకు విలువ పెంచింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదాలను పిలిపించుకొని మాట్లాడారు. పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించమని కోరారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో పార్టీని సమన్వయం చేసుకోమని సూచించారు. ఆ తరువాత కూడా మూడు, నాలుగు సార్లు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో పాటు ఆదాల చంద్రబాబును కలిసి పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ఇవన్నీ పార్టీలో ఆదాల పేరును విపరీతంగా ప్రచారంలోకి తెచ్చాయి. గత నాలుగున్నరేళ్లుగా పెద్దగా ప్రచారానికి నోచుకోని ఆదాలను ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే కీలక నాయకునిగా గుర్తించేలా చేశాయి. ఇదంతా రాత్రికి రాత్రి జ‌రిగిందంటే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌మాన‌దు.

ఆనం పార్టీలోనే ఉంటే…..

ఆనం క‌నుక టీడీపీలోనే ఉండి ఉంటే.. ఆదాల మ‌రో మార్గం చూసుకోవాల్సి వ‌చ్చేద‌న్న‌ది టీడీపీ నేత‌లే బ‌హిరంగంగా చెప్పిన మాట‌. అయితే, చంద్ర‌బాబు త‌న‌కు ఆశించిన మేర‌కు గుర్తింపు ఇవ్వ‌డం లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కుఎక్క‌డ నుంచి టికెట్ ఇస్తారో కూడా చెప్ప‌డం లేద‌నే కార‌ణంగా తీవ్ర క‌ల‌త చెందిన ఆనం.. వైసీపీలోకి చేరేందుకు మార్గం సుగ‌మం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆదాల‌కు ప్రాధాన్యం పెరిగింద‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. ఏదేమైనా.. ఆనం వ‌ల్ల ఆదాల‌కు లైఫ్ వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రి ఫ్యూచ‌ర్‌ను ఎలా మ‌లుచుకుంటారో ఆదాల చేతిలోనే ఉంద‌ని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*